ధనుష్.. ఎక్కడ తప్పు జరుగుతోంది?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
By: M Prashanth | 5 May 2026 1:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, గాయకుడు, నిర్మాతగా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. చిన్న వయసులోనే నేషనల్ అవార్డు అందుకోవడం ఆయన టాలెంట్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన ధనుష్.. ఇప్పుడు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.
అయితే, ఇటీవల విడుదలైన సినిమాల విషయంలో మాత్రం ఆయనకు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా కర సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ కంటెంట్ పరంగా వీక్ గా ఉండటంతో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇంతకుముందు వచ్చిన ఇడ్లీ కడై పరిస్థితి కూడా దాదాపు ఇదేలా ఉండటం గమనార్హం.
ఆ రెండు సినిమాలు కూడా కోలీవుడ్ దర్శకుల చేతిలో రూపొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ధనుష్ కథల ఎంపికలో కొత్తదనాన్ని కోరుకునే నటుడిగా పేరు సంపాదించుకున్నారు. కానీ ఇటీవల మాత్రం ఆ జాగ్రత్త కనిపించడం లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కథల్లో కొత్తదనం లేకపోవడం, పాత కథలనే కొత్త ప్యాకేజింగ్ తో అందించడం వంటి అంశాలు ప్రేక్షకులను విసిగిస్తున్నాయి.
ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం, కానీ కంటెంట్ పరంగా వీక్ గా ఉండటం సినిమాలపై ప్రభావం చూపుతోంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తెలుగు, హిందీ దర్శకులతో చేసిన సినిమాల్లో ధనుష్ కు మంచి విజయాలు దక్కుతున్నాయి. అక్కడ కథల ఎంపికలో కొత్తదనం, ప్రెజెంటేషన్ లో ఫ్రెష్ నెస్ ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది.
కానీ కోలీవుడ్‌లో మాత్రం అదే స్థాయి కంటెంట్ అందకపోవడం ఆయన కెరీర్ పై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది కోలీవుడ్ దర్శకులతో పని చేయడం తప్పు అని కాదు. కానీ కథల ఎంపికలో మరింత జాగ్రత్త అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ కు సరిపోయేలా, అలాగే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కథలు ఎంచుకోవడం కీలకం.
లేదంటే వరుసగా నిరాశలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడం గమనించదగ్గ విషయం. అంటే ఆయనకు కథలపై మంచి అవగాహన ఉందని అర్థమవుతోంది. కాబట్టి అదే దృష్టి ఇతర దర్శకులతో చేసే ప్రాజెక్టులపై కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూస్తే.. ధనుష్ కెరీర్ లో ప్రస్తుతం జరుగుతున్న చిన్నపాటి తడబాటు ప్రధానంగా కథల సెలక్షన్ లో ఉందని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెడితేనే మళ్లీ ఆయన సక్సెస్ లతో దూసుకెళ్లే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అభిమానులు కూడా ఆయన నుంచి అదే ఆశిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..
