Begin typing your search above and press return to search.

షాకింగ్ బజ్.. రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో!

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ కూడా భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 July 2026 5:47 PM IST
షాకింగ్ బజ్.. రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో!
X

తమిళనాడులో సినిమా రంగానికి, రాజకీయాలకు ఎప్పటినుంచో విడదీయరాని బంధం ఉంది. ఎందరో సినీ నటులు అక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ కూడా భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ధనుష్ ఫ్యాన్ క్లబ్ తాజాగా చేసిన ఒక పని ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం..

విజయ్ దారిలోనే ధనుష్ అడుగులు?:

తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, విజయ్‌కాంత్ నుంచి నిన్నటి దళపతి విజయ్ వరకు ఎంతోమంది సినీ తారలు ప్రజా క్షేత్రంలోకి వచ్చి నాయకులుగా రాణించారు. ఇక ఇప్పుడు అదే దారిలో ధనుష్ కూడా నడవబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. తాజాగా ధనుష్ ఫ్యాన్ క్లబ్ ఒక ఈవెంట్‌లో అఫీషియల్ ఫ్లాగ్‌ను లాంచ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా వరుస సేవా కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో, ధనుష్ త్వరలోనే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది.

కస్తూరి రాజా వ్యూహాత్మక కామెంట్స్:

ఇదే సమయంలో ధనుష్ తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఆయనకు ప్రశ్న ఎదురవగా.. ఆయన ఎంతో వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు. ఇక ఒకప్పుడు తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి జీవించిన గోపాలపురం, నేటి ముఖ్యమంత్రికి సంబంధించిన పోయస్ గార్డెన్ ప్రాంతాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, అది వారి వ్యక్తిగత ఇష్టమని పేర్కొన్నారు.

కొడుకులు లేదా మనవళ్లు రావచ్చు:

ఈ సందర్భంగా కస్తూరి రాజా తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు వయసు మళ్లింది సో నేను పాలిటిక్స్ రాను. కానీ భవిష్యత్తులో నా కొడుకులు ధనుష్, సెల్వరాఘవన్ లేదా నా మనవళ్లు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టవచ్చు" అని స్పష్టం చేశారు. ఇక తండ్రి నోట ఈ మాటలు రావడం, మరోవైపు ఫ్యాన్ క్లబ్ జెండాను రిలీజ్ చేయడంతో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ధనుష్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధనుష్ రాజకీయ ప్రవేశంపై రూమర్స్ పెరుగుతున్నా, ఆయన నుంచి ఇప్పటివరకు క్లారిటీ లేదు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, లోపలగా రాజకీయ గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న సందేహం ఫ్యాన్స్‌లో ఉంది.లేదా ఇవన్నీ కేవలం రూమర్సేనా? అనేది తెలియాలంటే స్వయంగా ధనుష్ నోరు విప్పేంత వరకు ఆగాల్సిందే. ఒకవేళ ధనుష్ నిజంగానే పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం కోలీవుడ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.