Begin typing your search above and press return to search.

ధనుష్‌ పాత సినిమా గొడవ.. 20 కోట్లు కట్టాల్సిందేనా?

పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘నాన్ రుద్రన్’ అనే సినిమా కోసం చేసిన ఖర్చులకు గానూ ధనుష్ 20 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తేనాండల్ ఫిలిమ్స్ డిమాండ్ చేస్తోంది.

By:  M Prashanth   |   14 Feb 2026 2:48 PM IST
ధనుష్‌ పాత సినిమా గొడవ.. 20 కోట్లు కట్టాల్సిందేనా?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు ఒక పాత ప్రాజెక్ట్ వల్ల లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2016లో అనౌన్స్ చేసిన ఒక సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో సంబంధిత నిర్మాణ సంస్థ కోర్టు మెట్లు ఎక్కింది. చెన్నైకి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ‘తేనాండల్ ఫిలిమ్స్’ ఈ మేరకు ధనుష్‌కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతోంది. పదేళ్ల క్రితం మొదలైన ఈ వివాదం మళ్ళీ తెరపైకి రావడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా సినిమాల షూటింగ్స్ ఆలస్యం అవ్వడం సహజం, కానీ ఈ విషయంలో మేకర్స్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ధనుష్‌తో అప్పట్లో ఒక భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసినట్లు, దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ చెబుతోంది. అయితే ధనుష్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా అటకెక్కిందని, దీనివల్ల తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘నాన్ రుద్రన్’ అనే సినిమా కోసం చేసిన ఖర్చులకు గానూ ధనుష్ 20 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తేనాండల్ ఫిలిమ్స్ డిమాండ్ చేస్తోంది. ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించడానికి కూడా ధనుష్ అప్పట్లో అంగీకరించారట. అక్కినేని నాగార్జున, ఎస్‌జే సూర్య లాంటి పెద్ద నటులను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్లు టాక్ వాస్తోంది. అయితే ధనుష్ హఠాత్తుగా మరో సినిమా దర్శకత్వం వైపు వెళ్ళిపోవడంతో ఈ మూవీ ఆగిపోయిందని మేకర్స్ ఆరోపిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం, ఇతర నటీనటులకు ఇచ్చిన అడ్వాన్సుల కోసం సుమారు 20 కోట్లు ఖర్చయ్యాయని నిర్మాణ సంస్థ లెక్కలు చెబుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయకపోవడం, డేట్లు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా వెయిట్ చేసినా ధనుష్ నుండి సరైన స్పందన లేకపోవడంతోనే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

లీగల్ నోటీసులో ధనుష్‌కు ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. 2025 చివరిలోపు ఈ సినిమాను పూర్తి చేయడానికి డేట్లు ఇస్తారా? లేక నష్టపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ ధనుష్ దీనికి స్పందించకపోతే, అసలు నష్టంతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు డ్యామేజెస్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని డెడ్ లైన్ కూడా విధించడం గమనార్హం.

ధనుష్ తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్న సమయంలో ఈ పాత గొడవ మళ్ళీ ముంచుకొచ్చింది. ధనుష్ ఇప్పటికే నయనతారతో ఒక వివాదంలో ఉండగా, ఇప్పుడు తేనాండల్ ఫిలిమ్స్ వేసిన ఈ కేసు ఆయనకు కొత్త తలనొప్పిగా మారింది. మరి ఈ 20 కోట్ల వివాదాన్ని ధనుష్ సామరస్యంగా పరిష్కరించుకుంటారా లేక కోర్టులోనే తేల్చుకుంటారా అన్నది చూడాలి.