Begin typing your search above and press return to search.

'కర' మూవీ రివ్యూ

ఇప్పుడు కర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Prakash Chimmala   |   30 April 2026 4:49 PM IST
కర మూవీ రివ్యూ
X

'కర' మూవీ రివ్యూ

నటీనటులు: ధనుష్ - మామిత బైజు - సూరజ్ వెంజరమూడు - జయరాం - కరుణాస్ - కేఎస్ రవికుమార్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్

నిర్మాత: ఇషారి గణేష్

రచన: ఆల్ఫ్రెడ్ ప్రకాష్ - విఘ్నేష్ రాజా

దర్శకత్వం: విఘ్నేష్ రాజా

తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుడు ధనుష్. విరామం లేకుండా సినిమాలు చేస్తూ సాగే ధనుష్ గత ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు చిత్రాలతో పలకరించాడు. ఇప్పుడు కర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక పల్లెటూరి కుర్రాడు. వ్యాపారం కోసం తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆయన దాచుకున్న మొత్తాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అలా దొంగగా మారిన అతను.. దొంగతనాలే జీవితంగా బతుకుతాడు. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని దొంగతనాలు వదిలిపెట్టి కష్టపడి జీవించాలని అనుకున్నా అతడికి కాలం కలిసిరాదు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ దొంగతనాలే చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ఇంతకీ కరకు కొత్తగా వచ్చిన కష్టం ఏంటి.. దాన్ని అతను ఎలా అధిగమించాడు.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ: ఒక చిన్న హీరోను పెట్టి పరిమిత వనరులతోనే ఒక కొత్త దర్శకుడి నుంచి ఒక పకడ్బందీ సినిమా తీసినపుడు.. తర్వాత కోరుకున్న బడ్జెట్లో ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ఎంతో ఊహించుకుంటాం. అందులోనూ ఆ దర్శకుడు తీసిన తొలి చిత్రం స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే థ్రిల్లర్ అయితే.. రెండో చిత్రంలో ప్రతి చిన్న విషయం ఇంకా ప్రత్యేకంగా-పకడ్బందీగా ఉంటుందని ఆశిస్తాం. కానీ ఆ దర్శకుడు కథాంశం దగ్గరే లాజిక్స్ వదిలేస్తే.. అలాంటి సినిమాతో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. తన డెబ్యూ మూవీ ‘పోర్ తొలిళ్’ చిత్రంతో థ్రిల్లర్ ప్రియులను ఉత్కంఠతో ఊపేసిన విఘ్నేష్ రాజా.. రెండో చిత్రం ‘కర’తో ఇలాగే తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇందులో ప్లాట్ పాయింటే పెద్ద లోపంగా కనిపిస్తుంది. వాస్తవ పరిస్థితులకు దూరం.. అసలేమాత్రం లాజిక్ లేకుండా.. జనాలకు తప్పుడు సందేశం ఇచ్చేలా దర్శకుడు రాసుకున్న పాయింట్... కొన్ని సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. వాటిని చూశాక ఈ సినిమాతో కనెక్ట్ కావడం చాాలా కష్టమవుతుంది.

‘కర’లో హీరో తండ్రి ఒక రైతు. ఆయనతో పాటు ఊరిలో ఉన్న రైతులందరూ ఒక ప్రభుత్వ బ్యాంకులో లోన్లు ఇస్తామంటే పొలం పత్రాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. కానీ వారికి కాలం కలిసిరాక అప్పులు కట్టలేకపోతారు. దీంతో బ్యాంకు అధికారులు భూముల్ని జప్తు చేయడానికి వస్తారు. దీంతో హీరో ఆ బ్యాంకులనే కొల్లగొట్టి అప్పులు తీర్చడానికి రెడీ అవుతాడు. దీన్ని జస్టిఫై చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థనే పరమ దుర్మార్గంగా చిత్రించారు ఈ చిత్రంలో. కనీసం ప్రైవేటు బ్యాంకులైనా సిబ్బందికి లోన్ టార్గెట్లు పెట్టి.. కస్టమర్లకు హిడెన్ ఛార్జీలు వేసి మోసం చేస్తాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ సినిమాలో చూపించేదేమో ప్రభుత్వ రంగ బ్యాంకు. ఆ బ్యాంకు సిబ్బంది లోన్ల పేరుతో రైతుల్ని మోసం చేయాలని చూసేట్లు.. కేవలం వడ్డీ కాకుండా ఏవేవో ఛార్జీల పేరు చెప్పి దోచేస్తారన్నట్లు ఇందులో చూపించారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులను ఎంతమాత్రం దోచుకోవు. సబ్సిడీలు ఇస్తాయి. ప్రభుత్వాలు కొన్నిసార్లు రుణమాఫీ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నమూ చేస్తుంటాయి. అతి తక్కువ వడ్డీతో లోన్లు అందిస్తాయి. రైతులు వెళ్లి ప్రభుత్వ బ్యాంకుల్లో లోన్లు ఇవ్వమని అడుగుతారే తప్ప.. వాళ్లు వీళ్లకు లోన్లు అంటగట్టడం అన్న ప్రశ్నే ఉండదు. కానీ సినిమాలో మాత్రం దీనికి భిన్నంగా లేని పోని కల్పనలు జోడించి బ్యాంకింగ్ వ్యవస్థనే విలన్‌ గా చేసి.. ఒక అర్థరహితమైన కథను నడిపించాడు విఘ్నేష్ రాజా. హీరోను రాబిన్ హుడ్ లా చూపించాలనుకోవడం బాగుంది కానీ.. ఈ క్రమంలో దర్శకుడు లాజిక్స్ తో సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చినట్లు కథాకథనాలను రాసుకున్నాడు. చనిపోయిన వ్యక్తిని తన పొలంలో పాతిపెడుతుంటే ఆ పొలం మీద లోన్ ఉందన్న కారణంతో బ్యాంకు అధికారులు వచ్చి అడ్డుకోవడం.. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత శవాన్ని తీసుకెళ్లి మార్చురీలో దాచి హీరో తీరిగ్గా దొంగతనాలు చేయడం లాంటి విపరీత సన్నివేశాలు చూస్తే ఇదేం విడ్డూరం అనిపించకమానదు.

ఐతే కథలో లాజిక్కుల సంగతి ఎలా ఉన్నా సరే.. వాటిని మరిపించేలా కథనం అయినా ఆసక్తికరంగా.. కొంచెం వేగంగా అయినా నడిస్తే సర్దుకోవచ్చు. కానీ ‘కర’లో అదీ లేకపోయింది. పేరుకు థ్రిల్లర్ సినిమా కానీ.. ఆరంభం నుంచి చివరి వరకు విపరీతమైన నత్తనడకతో సాగే సినిమా ఇది. ప్రధాన పాత్రతో కనెక్ట్ కాకుండా సినిమాతో పాటు ప్రయాణం చాలా కష్టం. ‘కర’లో అదే జరుగుతుంది. హీరో దొంగగా మారడానికి కానీ.. ఒకసారి వదిలేసిన దొంగతనాలు మళ్లీ చేయడానికి కానీ సహేతుకమైన కారణం కనిపించదు. తండ్రి చావుబతుకుల్లో ఉంటే కాపాడుకోవడానికి దొంగతనం చేస్తానంటే ఓకే కానీ.. చనిపోయిన వ్యక్తి కోసం హీరో ఈ పని చేయడానికి రెడీ అవడంలో లాజిక్ కనిపించదు. సినిమాలో తొలి ముప్పావుగంట మరీ హీరో హీరోయిన్ల కష్టాలు.. ఆ తర్వాత తండ్రితో అనుబంధాన్ని చూపించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడంతోనే ‘కర’ మీద ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో బ్యాంకులో రాబరీ చేసే ఒక్క ఎపిసోడ్ మాత్రమే కొంత ఉత్కంఠ రేకెత్తించి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ఆ ఎపిసోడ్ తో సినిమా కాస్త గాడినపడ్డట్లు అనిపించినా.. ద్వితీయార్ధంలో మళ్లీ మామూలే. కథ ఎటూ ముందుకు కదలకుండా ఒకేచోట స్ట్రక్ అయిపోయి ప్రేక్షకులకు తీవ్ర అసహనం తప్పదు. ఎంతకీ ముగించకుండా కథను సాగదీసి సాగదీసి ప్రేక్షకుల ఓపిక నశించిపోయేలా చేస్తాడు దర్శకుడు. చివర్లో మాత్రం కథానాయకుడు సూపర్ హీరోలా మారిపోయి ఒకేసారి చాలా చోట్ల రాబరీలు చేస్తాడు. అందులో లాజిక్ ఏంటో దర్శకుడికే తెలియాలి. కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉన్న ధనుష్.. ఇలాంటి కథకు అసలు ఎలా ఓకే చెప్పాడో అనిపించేలా సాగుతుంది ‘కర’. ధనుష్-మామిత జంటను చూసి.. ‘పోర్ తొలిళ్’ తీసిన దర్శకుడి సినిమా అని.. ‘కర’ మీద అంచనాలతో వెళ్తే తీవ్ర నిరాశ తప్పదు.

నటీనటులు: ధనుష్ నటనకు ఏమీ వంకలు పెట్టడానికి లేదు. కరస్వామి పాత్రకు న్యాయం చేయడానికి తన ప్రయత్నం తాను చేశాడు. చాలా చోట్ల ఇంటెన్స్ యాక్టింగ్ తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. మామిత బైజు డీగ్లామరస్ క్యారెక్టర్లో భిన్నంగా కనిపించింది. ఆమెను ఆ లుక్ లో చూసి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఐతే మామిత ప్రతిభను దర్శకుడు పెద్దగా ఉపయోగించుకోలేదు. మొదట్లో కొన్ని సన్నివేశాలకే ఆమెను పరిమితం చేశాడు. తర్వాత తన పాత్ర మాయం అయిపోతుంది. చివర్లో ఆ క్యారెక్టర్ తిరిగొచ్చినా ఇంపాక్ట్ ఏమీ కనిపించదు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడే పోలీసాఫీసర్ పాత్రలో సూరజ్ బాగా చేశాడు. తన నటన సహజంగా సాగింది. జయరాం బాగా నటించినా.. తన పాత్ర ఏమంత ప్రత్యేకంగా లేదు. కె.ఎస్.రవికుమార్.. కరుణాస్.. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం: జి.వి.ప్రకాష్ కుమార్ ‘కర’లో తన మార్కు పాటలు ఇవ్వలేదు. సాంగ్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ.. ఏదీ గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎమోషనల్ సీన్లలో బీజీఎం హృద్యంగా సాగింది. యాక్షన్ ఎపిసోడ్లలో కూడా స్కోర్ బాగుంది. తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. ఆల్ఫ్రెడ్ ప్రకాష్ తో కలిసి దర్శకుడు విఘ్నేష్ రాజా రాసిన స్క్రిప్టులోనే చాలా లోపాలున్నాయి. వ్యవస్థను విలన్ గా చూపించాలనుకున్నపుడు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సన్నివేశాలుండాలి. కానీ అవాస్తవాలు, అతిశయోక్తులు జోడించి కథను తీర్చిదిద్దితే అది బెడిసికొడుతుందనడానికి ‘కర’ ఉదాహరణ. విఘ్నేష్ రాజా దర్శకుడిగా కొన్ని సన్నివేశాల్లో పనితనం చూపించినా.. ఓవరాల్ గా నిరాశపరిచాడు.

చివరగా: కర.. కనెక్ట్ అవ్వలేం

రేటింగ్ - 2/5