మళ్లీ ధనుష్–జీవీ ప్రకాష్ జోడీ? సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కార' నుండి మొదటి పాట 'వాయా ఏయ్ కరాసామి' తాజాగా విడుదలైంది.
By: Madhu Reddy | 17 March 2026 4:00 AM ISTధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కార' నుండి మొదటి పాట 'వాయా ఏయ్ కరాసామి' తాజాగా విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ, సాంగ్ విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన లభిస్తోంది. ఊహించిన స్థాయిలో పాట ఆకట్టుకోలేకపోవడంతో, ధనుష్ మళ్లీ మళ్లీ జీవీ ప్రకాష్‌తోనే పనిచేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఏమిటి, నెటిజన్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
అంచనాలు తలకిందులు :
ధనుష్ సినిమాల్లో పాటలంటే చార్ట్‌బస్టర్స్ గ్యారెంటీ అని అంతా భావిస్తారు. అయితే 'కార' చిత్రంలోని మొదటి సింగిల్ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పాట విన్న చాలామంది ఇది చాలా 'యావరేజ్'గా ఉందని పెదవి విరుస్తున్నారు. మ్యూజిక్‌లో ఎనర్జీ ఉన్నా, గుర్తుంచుకునేలా మాత్రం లేదని అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం వ్యూస్‌పై కూడా కనిపిస్తోంది. ఇక సాధారణంగా ధనుష్ పాటలకు వచ్చే రెస్పాన్స్ కంటే ఈ సారి చాలా తక్కువగా అంటే 2.4 మిలియన్ వ్యూస్, 87 వేల లైక్స్ మాత్రమే రావడం గమనార్హం.
కాంబినేషన్ రిపీట్ అవ్వడం వల్లే బోర్ కొడుతోందా?:
ధనుష్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ జోడీ గతంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. 'పొల్లాధవన్', 'ఆడుకలం' వంటి సినిమాల్లో వీరి సంగీతం ఒక ఊపు ఊపింది. కానీ, ఇప్పుడు వరుసగా వీరిద్దరే కలిసి పనిచేయడం వల్ల మ్యూజిక్ స్టైల్ అంతా ఒకేలా అనిపిస్తోందని, బోర్ కొడుతోందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ధనుష్ ఇకనైనా ఇతర సంగీత దర్శకులతో ప్రయోగాలు చేయాలని, కొత్త వాళ్లతో పనిచేస్తే ఫ్రెష్ మ్యూజిక్ వస్తుందని వారు కోరుతున్నారు. ఈ రిపీటెడ్ కాంబినేషన్ వల్ల క్రేజ్ తగ్గుతోందన్నది ఫ్యాన్స్ వాదన.
ట్రాకర్ల వాదన.. సినిమాలో చూస్తే వేరేలా ఉంటుంది:
ఇక అయితే ఈ విమర్శలపై కోలీవుడ్ సినీ విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. 'కార' సినిమా కథా నేపథ్యం ప్రకారం ఈ పాట కేవలం హీరో ఎలివేషన్ కోసం డిజైన్ చేసినదని, కేవలం వినడానికి కాకుండా వెండితెరపై విజువల్స్‌తో చూసినప్పుడు దీని ఇంపాక్ట్ అదిరిపోతుందని వారు చెబుతున్నారు. ఇక ప్రతి సినిమాలోనూ డ్యూయెట్స్ లేదా వైరల్ సాంగ్స్ ఉండాల్సిన అవసరం లేదని, కథలో భాగంగా వచ్చే ఇలాంటి పాటలను సినిమా రిలీజ్ అయ్యాక చూస్తేనే వాటి అసలు వాల్యూ తెలుస్తుందని ధనుష్ సపోర్టర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆశలన్నీ తదుపరి పాటలపైనే:
మొత్తానికి 'కార' మొదటి పాట ధనుష్ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అయితే ఈ ఆల్బమ్‌లో ఇంకా మరికొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటలైనా ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీవీ ప్రకాష్ తన తదుపరి ట్రాక్స్‌తోనైనా విమర్శకుల నోళ్లు మూయిస్తారో లేదో చూడాలి. ఇక ఒకవేళ మిగిలిన పాటలు హిట్ అయితే, ఈ ధనుష్–జీవీ ప్రకాష్ కాంబినేషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే!
