Begin typing your search above and press return to search.

ధనుష్ 'కరా' ప్రీ-రిలీజ్: బాక్సాఫీస్ వద్ద 'సార్' రికార్డులను తిరగరాస్తుందా?

వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు `కర` (KARA) చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు.

By:  Sivaji Kontham   |   27 April 2026 12:12 AM IST
ధనుష్ కరా ప్రీ-రిలీజ్: బాక్సాఫీస్ వద్ద సార్ రికార్డులను తిరగరాస్తుందా?
X

వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు `కర` (KARA) చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం జ‌రిగిన‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొని చిత్ర యూనిట్‌కు తన మద్దతును అందించారు. టీజర్ తనను ఎంతో ఆకట్టుకుందని.. ముఖ్యంగా ఈ చిత్రంలోని కంటెంట్ చాలా బలంగా ఉందని ఆయన ప్రశంసించారు. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ త‌న అభిమాన హీరో ధ‌నుష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్‌తో తాను చేసిన `వాతి` (సార్) సినిమా తనకు ఒక రీలాంచ్ లాంటిదని.. ఆ చిత్రం తన కెరీర్‌కు మళ్ళీ ఊపిరి పోసిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న `కర` చిత్రం `సార్` కంటే రెండు మూడు రెట్లు పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందని.. ధనుష్ నటన మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని విశ్లేషించారు.

సంగీతపరంగా ఈ సినిమాకు ఉన్న బలాన్ని ప్రస్తావిస్తూ.. ధనుష్ - జీవీ ప్రకాష్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని వెంకీ అట్లూరి కొనియాడారు. వారిద్దరూ ఒకరినొకరు `మామా మామా` అని పిలుచుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ అని..ఈ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ఈ చిత్రంలో కూడా జీవీ ప్రకాష్ అందించిన సంగీతం మేజర్ అసెట్ కానుందని తెలిపారు. అలాగే ఈ వేదికపై దిగ్గజ దర్శకుడు కేఎస్ రవికుమార్ గారితో కలిసి ఉండటం తన అదృష్టమని.. ఆయన సినిమాలు చూస్తూనే తాను పెరిగానని గౌరవంగా పేర్కొన్నారు.

`కర` మూవీ కాస్టింగ్- క్రూ విషయానికి వస్తే.. ఇందులో ధనుష్ సరసన కథానాయికగా మ‌మిత భైజు నటించగా కీలక పాత్రల్లో కేఎస్ ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. స‌తీష్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విఘ్నేష్ రాజాను వెంకీ అట్లూరి సాదరంగా ఆహ్వానించారు. సాంకేతిక నిపుణుల పనితీరు, దర్శకుడి మేకింగ్ స్టైల్ ఈ యాక్షన్ డ్రామాను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

మొత్తానికి ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న `కర` చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ధనుష్ ఇమేజ్ మాత్రమే కాకుండా.. బలమైన కథాబలం ఉన్న చిత్రంగా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా విజయంపై అంతటి నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఈ మ్యాజిక్ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేసవి కానుకగా రాబోతున్న ఈ చిత్రం ధనుష్ ఖాతాలో మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర‌బృందం పాల్గొంది. సాయి దుర్గ‌తేజ్, బుచ్చిబాబు త‌దిత‌రులు అతిథులుగా పాల్గొన్నారు.