ఇడ్లీ తినడానికి కూడా డబ్బులుండేవి కాదు
రీసెంట్ గా కుబేర సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకున్న ధనుష్ ఇప్పుడు ఇడ్లీ కడై అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించారు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 3:00 PM ISTప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్ గా తన మల్టీ టాలెంట్ తో ఆడియన్స్ ను ప్రతీసారీ సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ధనుష్ ఇప్పుడు సౌత్ లోని బెస్ట్ యాక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
నిత్య మీనన్ తో రెండోసారి..
రీసెంట్ గా కుబేర సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకున్న ధనుష్ ఇప్పుడు ఇడ్లీ కడై అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. నిత్య మీనన్ ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా నటించారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో తిరు సినిమా రాగా ఆ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు రెండోసారి వీరి కలయికలో మూవీ వస్తుండటంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.
కాలంతో పాటూ మారాల్సిందే
షాలినీ పాండే, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఇడ్లీ కడై అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తనకు ప్రతీ రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదని కానీ అప్పుడు తన వద్ద ఇడ్లీ కొనుక్కోవడానికి డబ్బులుండేవి కావని, ఇప్పుడు డబ్బులున్నా తన చిన్నతనంలో తినేటప్పుడు ఉన్నంత ఆనందం, టేస్ట్ లేవని, ఏదైనా కాలంతో పాటూ మనం కూడా మారాల్సిందేనని చెప్పుకొచ్చారు ధనుష్.
ఫేక్‌కు, రియాలిటీకి చాలా తేడా ఉంటుంది
అదే ఈవెంట్ లో ట్రోలింగ్ గురించి కూడా ధనుష్ మాట్లాడారు. అసలు హేటర్స్ కాన్సెప్టే లేదని, అందరూ అందరి హీరోల సినిమాలు చూస్తారని, ఎవరో 30 మంది ఓ టీమ్ గా చేరి, 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి కావాలని కొంతమంది హీరోలపై ద్వేషాన్ని చూపిస్తున్నారని, అయితే ఆ 30 మంది కూడా సినిమా చూస్తారని, బయట కనిపించే దానికీ, రియాలిటీకి చాలా తేడా ఉంటుందని, దాన్ని అందరూ గమనించాలని ధనుష్ తెలిపారు.
వడ చెన్నై సీక్వెల్ ను అనౌన్స్ చేసిన ధనుష్
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తాను చేయనున్న సినిమాను కూడా ధనుష్ అనౌన్స్ చేశారు. త్వరలోనే తాను వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై సీక్వెల్ ను చేయబోతున్నానని చెప్పారు. ఏదేమైనా ధనుష్ సినిమా సినిమాకీ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ఒక దాని తర్వాత మరొకటి లైన్ లో పెడుతూ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరి ఇడ్లీ కడై సినిమా ధనుష్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
