Begin typing your search above and press return to search.

ఆ పాత్ర ఎంతో ప్ర‌భావితం చేసింది

ఆయ‌న న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా సినిమా ఇడ్లీ క‌డై. ఓ మామూలు ఇడ్లీ కొట్టు న‌డిపే వ్య‌క్తి క‌థ‌గా తెర‌కెక్కిన ఈ ఎమోష‌న‌ల్ మూవీ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Sept 2025 12:00 PM IST
ఆ పాత్ర ఎంతో ప్ర‌భావితం చేసింది
X

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ గురించి, ఆయ‌న‌ టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న ఏ పాత్ర‌లో న‌టించినా అందులో ఒదిగిపోయి ఆ పాత్ర‌కు 100% న్యాయం చేకూరుస్తారు. ఆయ‌న న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా సినిమా ఇడ్లీ క‌డై. ఓ మామూలు ఇడ్లీ కొట్టు న‌డిపే వ్య‌క్తి క‌థ‌గా తెర‌కెక్కిన ఈ ఎమోష‌న‌ల్ మూవీ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేయ‌గా, రీసెంట్ గా జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ధ‌నుష్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో మ‌నం ఏం కావాల‌ని కోరుకుంటామో అదే అవుతామ‌ని ధ‌నుష్ చెప్పారు. చెఫ్ కావాల‌ని త‌న‌కెప్ప‌టి నుంచో ఉండేద‌ని, బ‌హుశా అందుకే త‌న‌కు చెఫ్ క్యారెక్ట‌ర్స్ వ‌స్తున్నాయేమో అని ఆయ‌న‌ అన్నారు.

అందుకే అవే పాత్ర‌లొస్తున్నాయి

గ‌తంలో కూడా ధ‌నుష్ ప‌లు సినిమాల్లో చెఫ్ గా, వంట చేస్తూ క‌నిపించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌మే తందిర‌మ్ లో ప‌రోటాలు చేస్తూ క‌నిపించిన ధ‌నుష్‌, తిరుచిత్రంబ‌లం మూవీలో డెలివ‌రీ బాయ్‌గా న‌టించి మెప్పించారు. ఇక మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన రాయ‌న్ సినిమాలో ధ‌నుష్ ఫాస్ట్ ఫుడ్ షాప్ ను మెయిన్ టెయిన్ చేసిన సంగతీ తెలిసిందే. చెఫ్ పాత్ర త‌న‌ను నిజ జీవితంలో కూడా ఎంతో ప్ర‌భావితం చేసింద‌ని ధ‌నుష్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

త‌న కోసం తానేదైనా స్క్రిప్ట్ రాసుకునేట‌ప్పుడు కూడా చెఫ్ గానే ఊహించుకుంటాన‌ని, చెఫ్ పాత్ర‌పై త‌న‌కున్న ఇష్టం వ‌ల్లే తన‌కు అలాంటి పాత్ర‌లొస్తున్నాయేమో అనిపిస్తుంద‌ని ధ‌నుష్ చెప్పుకొచ్చారు. యాక్ట‌ర్ అయ్యాక కూడా తాను త‌న కోరిక‌ను నెర‌వేర్చుకుంటున్నాన‌ని, యువ‌త కూడా అలానే త‌మ ల‌క్ష్యాల‌ను సాధించేదిశ‌గా న‌మ్మ‌కంతో అడుగులేసి స‌క్సెస్ అవాల‌ని ఆయ‌న సూచించారు. ఇక ఇడ్లీ క‌డై విష‌యానికొస్తే తెలుగులో ఈ సినిమా ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో రానుండ‌గా, ఈ మూవీలో నిత్యామీన‌న్ ధ‌నుష్ కు జోడీగా న‌టిస్తున్నారు.