Begin typing your search above and press return to search.

పాద న‌మ‌స్కారం: ధనుష్‌కి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రేంజులోనా?

అభిమాని తన పాదాలను తాకడంతో కొంత అసౌకర్యానికి లోనైన ధనుష్.. వెంటనే ఆమెను వారించి పైకి లేపారు.

By:  Sivaji Kontham   |   28 April 2026 11:00 PM IST
పాద న‌మ‌స్కారం: ధనుష్‌కి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రేంజులోనా?
X

తమిళ సూపర్ స్టార్ ధనుష్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 26న జరిగిన ఆయన తాజా చిత్రం `కర` ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్‌కు తన మహిళా అభిమాని నుండి ఎదురైన అనుభవం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధనుష్ వేదిక దిగి వెళ్తున్న సమయంలో ఒక మహిళా అభిమాని అత‌డి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేస్తూ తన భక్తిని, ప్రేమను కనబరిచారు. ఈ అనూహ్య పరిణామంతో ధనుష్ కొంత ఇబ్బంది పడినా ఆ స‌మ‌యంలో ఎంతో వినమ్రంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అభిమాని తన పాదాలను తాకడంతో కొంత అసౌకర్యానికి లోనైన ధనుష్.. వెంటనే ఆమెను వారించి పైకి లేపారు. అలా చేయవద్దని హితవు పలుకుతూనే.. ఎంతో మర్యాదగా ఆమెతో కాసేపు మాట్లాడారు. ఆ అభిమాని కోరిక మేరకు ఆమెతో సెల్ఫీ దిగి.. ఎంతో ఆప్యాయంగా పంపించి తన గొప్ప సంస్కారాన్ని చాటుకున్నారు. ఇది నిజంగా ఒక గ్రేట్ ఫ్యాన్ మూమెంట్ అని.. ఆ అభిమాని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని చెప్పవచ్చు. స్టార్ హీరోలు తమ అభిమానుల విష‌యంలో ఎంత వినమ్రంగా ఉంటారో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

హీరోలను పిచ్చిగా ప్రేమించే `ఫ్యానిజం` నేటికీ అంతరించిపోలేదని ఈ సంఘటనతో మరోసారి నిరూపణ అయింది. ధనుష్ మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారికి కూడా భారీగా మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఏకంగా జపాన్ నుండి మహిళా అభిమానులు ఆయన ఇంటికే రావడం ఒక సంచలనం. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారికి జపాన్ సహా ప్రపంచ దేశాలలో మహిళా ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరుగుతుండటం ఇటీవలి కాలంలో కనిపిస్తున్న కొత్త పరిణామం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఫ్యానిజం సరిహద్దులు దాటుతోంది.

ధనుష్ కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో మ్యాజిక్ చేస్తున్నారు. ముఖ్యంగా `ఆడుక‌ళం, సెవెన్ జీ బృందావన కాలనీ (రెయిన్ బో కాలనీ), రాంజనా వంటి చిత్రాలలో ఆయన కనబరిచిన నటనకు మహిళా అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రతిసారీ విలక్షణమైన స్క్రిప్టులతో ప్రయోగాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ధనుష్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. నటుడిగా ఆయన చూపే ప్రతిభే నేడు ఈ స్థాయి ఆరాధనకు కారణమైంది.

అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు దీనిని ఒక అరుదైన అభిమానంగా అభివర్ణిస్తుంటే.. మరికొందరు నటులను దేవుళ్లలా ఆరాధించడం ఆపాలని విమర్శిస్తున్నారు. ఇదే వేదికపై ధనుష్ మాట్లాడుతూ తన యువ అభిమానులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. నటులను ఆరాధించడమే కాకుండా.. తమ సొంత లక్ష్యాల విష‌యంలో నమ్మకంతో ఉండాలని... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడాలని హితవు పలికారు. ఈ ప్రసంగం ఆయన పరిణతికి అద్దం పట్టింది. ధ‌నుష్ న‌టించిన క‌ర తెలుగు-త‌మిళం- హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.