Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు మూడేళ్లు అంటుంటే అత‌డు మాత్రం దున్నేస్తున్నాడు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరో ఒక సినిమా పూర్తి చేయాలంటే? కనీసం రెండు నుండి మూడేళ్ల సమయం పడుతోంది.

By:  Srikanth Kontham   |   25 April 2026 8:00 AM IST
మ‌నోళ్లు మూడేళ్లు అంటుంటే అత‌డు మాత్రం దున్నేస్తున్నాడు!
X

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరో ఒక సినిమా పూర్తి చేయాలంటే? కనీసం రెండు నుండి మూడేళ్ల సమయం పడుతోంది. అగ్ర హీరోలంతా పాన్ ఇండియా ఇమేజ్ కోసం, విజువల్ వండర్స్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి స‌మయం కేటాయిస్తున్నారు. దీంతో అభిమానులు ఫేవరెట్ హీరోను వెండితెరపై చూడటానికి సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వస్తోంది. కోలీవుడ్లో కూడా కొంత మంది బిగ్ స్టార్స్ ఇదే ప‌ద్ద‌తిలో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారంద‌రి ప్ర‌యాణానికి భిన్నంగా ధనుష్ మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు.

వరుస సినిమాలను పట్టాలెక్కిస్తు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాడు. ధనుష్ నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక‌ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. నటుడిగా బిజీగా ఉంటూనే కథలను రాస్తూ సినిమాలను డైరెక్ట్ చేయడం ధనుష్‌కే సాధ్యమని నిరూపిస్తున్నాడు. తాజాగా ధనుష్ మరో అడుగు ముందుకేసి లేడీ ఓరియేంటెడ్ కథలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.

మాస్ మసాలా చిత్రాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ దర్శకుడిగా పరిధిని పెంచుకుంటున్నాడు. మహిళా నటుల ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆయన రూపొందిస్తున్న కథలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తన సినిమాల్లో హీరోకే కాకుండా ప్రతి పాత్రకు వెయిటేజీ ఉండేలా చూసుకోవడం ధనుష్ ప్రత్యేకత. తెలుగు హీరోలు గ్రాఫిక్స్ , పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెలల తరబడి వెయిట్ చేస్తుంటే ధనుష్ మాత్రం కంటెంట్ ఉంటే చాలు అన్నట్లుగా షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లోనూ నటిస్తూనే సొంతంగా స్క్రిప్టులు రాసుకోవడం సినిమా ప‌ట్ల‌ ధ‌నుష్‌ అంకితభావాన్ని చాటుతోంది.

అందుకే ధ‌నుష్ ఏటా కనీసం రెండు సినిమాలతోనైనా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఆర‌కంగా కాలం విలువ తెలిసిన నటుడిగా ధనుష్ మిగతా హీరోలకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. మూడేళ్లకు ఒక సినిమా తీసి భారీ హిట్ కొట్టడం కంటే నిరంతరం వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడం మేలని భావిస్తున్నాడు. ధనుష్ వేగం చూసి మిగ‌తా హీరోలు కూడా వర్కింగ్ స్టైల్‌లో మార్పులు చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ధనుష్ మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలని ఆశీద్దాం.