Begin typing your search above and press return to search.

అభిమాని మ‌న‌సు గెలుచుకున్న స్టార్ హీరో!

ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంత‌రం వేదిక దిగి వెళ్తుండ‌గా?

By:  Srikanth Kontham   |   28 April 2026 8:30 AM IST
అభిమాని మ‌న‌సు గెలుచుకున్న స్టార్ హీరో!
X

పాన్ ఇండియా లో గుర్తింపు పొందిన నటుడు ధనుష్. కోట్లాది మంది అభిమానించే న‌టుడు. తెలుగులోనూ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను క‌లిగి ఉన్నాడు. అలాంటి స్టార్ తాజాగా ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సాధారణంగా అభిమానులు త‌మ‌ అభిమాన హీరోలను కలిసినప్పుడు అత్యుత్సాహంతో , గౌరవంతో పాదాభివందనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ధనుష్ తన అభిమానిని అలా చేయకుండా నిరోధించి ఎంతో గౌరవంగా పలకరించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంత‌రం వేదిక దిగి వెళ్తుండ‌గా? ఒక అభిమాని హఠాత్తుగా ధ‌నుష్ వద్దకు వచ్చి కాళ్ళపై పడటానికి ప్రయత్నించాడు. అది గమనించిన ధనుష్ వెంటనే స్పందించి ఆ అభిమానిని ఆపి పైకి లేపారు. గౌరవాన్ని చాటుకోవడానికి కాళ్ళపై పడాల్సిన అవసరం లేదని హృదయపూర్వకమైన పలకరింపు సరిపోతుందని తన ప్రవర్తన ద్వారా సున్నితంగా తెలియజేశాడు. ధనుష్ చూపించిన సంస్కారానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

`స్టార్‌డమ్ తలకెక్కిన ఈ రోజుల్లో ఇంతటి క్రేజ్ ఉన్న హీరో ఇంత ఒదిగి ఉండటం గొప్ప విషయం` అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీలు అంటే కేవలం తెరపై కనిపించే పాత్రలు మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని నిరూపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా తమ అభిమానాన్ని చాటుకోవడంలో హద్దులు దాటకూడదని ఈ సంఘటన గుర్తు చేస్తోంది.

హీరోలను దైవ సమానులుగా భావించి కాళ్ళపై పడటం కంటే వారిని గౌరవప్రదంగా పలకరించడమే సరైన పద్ధతని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ధనుష్ ఆ అభిమానిని ఆత్మీయంగా పలకరించి, అతనితో ఫోటో దిగడం ఆ వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ధనుష్ ఎంతో నిరాడంబరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎన్ని అవార్డులు వచ్చినా? ఎంతటి అంతర్జాతీయ గుర్తింపు లభించినా ? ఆయన మూలాలను మర్చిపోకుండా వ్యవహరిస్తుంటారు.

తాజా సంఘటన ఆయనలోని మానవత్వాన్ని , సహజత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి హుందాతనం వల్లే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అపార‌ ఆదరణ ల‌భిస్తోంది. ధనుష్ వంటి అగ్ర నటులు తమ చిన్న చిన్న చర్యల ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంటారు. అహంకారం లేని వ్యక్తిత్వం , తోటి మనుషుల పట్ల కనీస గౌరవం ఉండటం ఎంత అవసరమో తన ప్రవర్తనతో చూపించారు. ఈ ఘటనతో ధనుష్ నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.