Begin typing your search above and press return to search.

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

తండ్రి ధనుష్ అవార్డుల వేడుక కోసం యాత్ర, లింగ గ్రీస్ పర్యటనను మధ్యలోనే ముగించుకుని భారత్‌కు తిరిగివచ్చారు. వేదికపై తన పక్కన కుమారులు నిలబడటం ప్రత్యేక క్షణమని ధనుష్ భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్తులో వారు తనకంటే పది రెట్లు ఎదగాలని ఆకాంక్షించారు.

By:  Srikanth Kontham   |   21 Nov 2026 12:08 PM IST
తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!
X

గ్రీస్‌లో సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న విదేశీ పర్యటనను మధ్యలోనే ఆపేసి తండ్రి ధనుష్ కోసం తనయులు యాత్ర, లింగ ఇండియాకు విమానమెక్కారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం తర్వాత తల్లి ఐశ్వర్య.. తాత రజనీకాంత్‌లతో ఏథెన్స్‌లో విహారయాత్రలో ఉన్న ఇద్ద‌రు ఇటీవల జరిగిన ఓ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో తండ్రి పక్కన నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ క్షణం తనకెంతో ప్రత్యేకమని ధనుష్ వేదికపైనే భావోద్వేగానికి లోనయ్యారు.

తండ్రిగా తాను చేసే ప్రతి పని వెనుక ఒకే ఒక బలమైన కారణం ఉందని ధనుష్ మనసు విప్పారు. భవిష్యత్తులో ఇద్దరు కొడుకులు తనకు గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నానని.. ఆ హక్కుతో వాళ్లను అడగాలంటే ముందుగా తాను వాళ్లను గర్వపడేలా చేయాలని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడని.. అయితే యాత్ర, లింగ మాత్రం భవిష్యత్తులో తనకంటే పది రెట్లు ఎత్తుకు ఎదుగుతారని ధ‌నుష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే వేదికపై ధనుష్ నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టమని యాంకర్ అడిగిన ప్రశ్నకు యాత్ర, లింగ కాస్త తడబడ్డారు. తమకు తండ్రి అంటే ఎంతో ఇష్టమని.. ఆయన చేసిన వాటిలో ఒక సినిమాను ప్రత్యేకంగా ఎంచుకోవడం చాలా కష్టమని తప్పించుకున్నారు. వాళ్లు కూడా తనలాగే చాలా సిగ్గుపడతారని ధనుష్ నవ్వుతూ సమర్థించడం ఆడిటోరియంలో నవ్వులు పూయించింది.

మరోవైపు నవంబర్ 11న గ్రీస్‌లో జరిగిన అనిరుధ్, కావ్య మారన్ వివాహానికి ధనుష్ హాజరుకాలేదు. ఒకప్పుడు `3` సినిమాతో మొదలై `తిరుచిత్రంబళం` వరకు అద్భుతమైన హిట్లు ఇచ్చిన ఈ కాంబినేషన్ 2022లో ఐశ్వర్యతో ధనుష్ విడిపోయిన తర్వాత మళ్లీ కలవలేదు. అలాంటి నేపథ్యంలో తల్లితో కలిసి పెళ్లికి వెళ్లిన పిల్లలు, తండ్రి అవార్డు వేడుక కోసం ప్రత్యేకంగా తిరిగి రావడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ధనుష్ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మమ్ముట్టి, సాయి పల్లవిలతో కలిసి నటించిన `ఓం` చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. దీనితో పాటు వెట్రిమారన్, తమిళరసన్ పచ్చముత్తు ప్రాజెక్టులతో ధ‌నుష్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.