ధనుష్ రూట్ మార్చాల్సిన టైమొచ్చింది
ధనుష్ సినిమాల్లో ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తున్న ట్రెండ్ ఎమోషనల్ హై డ్రామా. కథల కంటే ధనుష్ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 2 May 2026 12:55 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికర దశలో ఉంది. నటుడిగా అతని సామర్థ్యం ఎప్పుడూ ప్రశ్నార్థకంగా మారలేదు. కానీ అతను ఎంచుకుంటున్న కథలు, ముఖ్యంగా ఎమోషన్స్ పై ఆధారపడిన హై డ్రామా సబ్జెక్ట్స్, ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు రఘువరన్ బీటెక్, తిరుచిత్రాంబలం వంటి లైట్, రిలేటబుల్ కథలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్, ఇప్పుడు వరుసగా బాధ, అణచివేత, ప్రతీకారం లాంటి సీరియస్ రోల్స్ వైపు మళ్లడం గమనార్హం. ఈ మార్పు యాక్టర్ గా అతని రేంజ్‌ను చూపించినా, ప్రేక్షకుల్లో మాత్రం మోనోటనీ ఫీల్ కలిగిస్తున్నదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ధనుష్ సినిమాల్లో ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తున్న ట్రెండ్ ఎమోషనల్ హై డ్రామా. కథల కంటే ధనుష్ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇక్కడే ప్రధాన సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ ఫార్ములా యాక్టింగ్ పరంగా ప్రశంసలు తెచ్చిపెట్టినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఉదాహరణకు రాయన్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాల్లో గాఢమైన కథనం, డార్క్ టోన్ ఉన్నప్పటికీ, అవి ఎక్కువమంది ప్రేక్షక వర్గానికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాయి. దీంతో కేవలం ఎమోషనల్ ఇంపాక్ట్ తోనే హిట్స్ సాధ్యమవుతాయా అనే ప్రశ్న ముందుకొస్తుంది.
ఇక మరో వైపు, ధనుష్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడనే విషయాన్ని ఎవరూ ఖండించలేరు. ప్రతి సినిమాలో కొత్త షేడ్, కొత్త క్యారెక్టర్ ప్రయత్నించడం అతని ప్రత్యేకత. అయితే ఈ ప్రయోగాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్ తగ్గిపోవడంతో అతని సినిమాలు మరీ సీరియస్ మోడ్‌లోకి వెళ్తున్నట్టు ఆడియన్స్ ఫీలవుతున్నారు. ఎప్పుడైనా థియేటర్‌కి వచ్చే ఆడియన్స్ కేవలం బాధ, ఎమోషన్స్ ను చూడ్డానికే రారు, వాళ్లు ఎంటర్టైన్‌మెంట్ కూడా ఆశిస్తారు. ఈ నేపథ్యంలో ధనుష్ సినిమాల్లో అది మిస్ అవుతుందని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.
ధనుష్ నుంచి కొన్నాళ్లుగా వస్తున్న సినిమాల్లో సార్ మినహా మిగిలినవన్నీ ఒకే తరహాలో అనిపిస్తాయి. సార్ సినిమాలో కాకుండా మిగిలిన అన్ని సినిమాల్లో ధనుష్ సీరియస్ టోన్‌లోనే కనిపిస్తారు తప్పించి ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో ధనుష్ ఎంపిక చేసుకుంటున్న డైరెక్టర్లు, కథలు కూడా మారాలని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, ధనుష్ ప్రస్తుతం ఎక్స్‌పెరిమెంట్స్ వర్సెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సున్నితమైన లైన్‌పై నడుస్తున్నారు. నటుడిగా అతను చేసే ఎక్స్‌పెరిమెంట్స్ ప్రశంసనీయం. కానీ స్టార్ హీరోగా మార్కెట్‌ను నిలబెట్టుకోవాలంటే, ప్రేక్షకుడి పల్స్‌ను కూడా అర్థం చేసుకోవాలి. వరుసగా డార్క్, ఎమోషనల్ డ్రామాలపై ఆధారపడటం ఇమేజ్‌కు రిస్క్‌గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధనుష్ కు ఒక సాలిడ్, బ్యాలెన్డ్స్ కమర్షియల్ హిట్ అతని కెరీర్‌కు రీసెట్ బటన్‌లా మారే అవకాశముంది.
