Begin typing your search above and press return to search.

భన్సాలీతో రామ్ చరణ్ మూవీ లేన‌ట్టేనా? ధనుష్‌తో చ‌ర్చ‌లు!

ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని భన్సాలీ తన సొంత బ్యానర్‌లో నిర్మించనుండగా.. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

By:  Sivaji Kontham   |   28 April 2026 10:54 PM IST
భన్సాలీతో రామ్ చరణ్ మూవీ లేన‌ట్టేనా? ధనుష్‌తో చ‌ర్చ‌లు!
X

భారతీయ చలనచిత్ర రంగంలో అద్భుతమైన దృశ్యకావ్యాలను ఆవిష్కరించే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పని చేయడం కోసం దేశంలోని స్టార్ హీరోలందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటివరకు బాలీవుడ్ దిగ్గజాలతోనే సినిమాలు చేసిన భన్సాలీ ఇటీవలి కాలంలో దక్షిణాది పాన్ ఇండియా స్టార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భన్సాలీ సినిమా ఉంటుందని.. ఇప్పటికే వారికి స్క్రిప్ట్ కూడా వినిపించారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారమయ్యాయి.

అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ తో భ‌న్సాలీ ప్రాజెక్టుకు సంబంధించి సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ - భన్సాలీ కాంబినేషన్‌లో పట్టాలెక్కాల్సిన చిత్రం మధ్యలోనే ఆగిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో చరణ్‌కు వినిపించిన అదే స్క్రిప్టును ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి భన్సాలీ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కథలో పలుమార్లు మార్పులు చేసిన తర్వాత.. కొన్ని నెలల క్రితమే తుది స్క్రిప్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. చరణ్‌తో చర్చలు విఫలమయ్యాక.. ఈ అవకాశం ధనుష్‌కు దక్కిందని బాలీవుడ్ సమాచారం.

ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని భన్సాలీ తన సొంత బ్యానర్‌లో నిర్మించనుండగా.. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. అభిమన్యుడు, స‌ర్దార్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మిత్రన్‌కు హిందీలో ఇదే తొలి సినిమా కానుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ పౌరాణిక గాథలో ధనుష్ ఇప్పటివరకు కనిపించని ఒక విభిన్నమైన.. వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద హిందీ ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని భావిస్తున్నారు.

ధనుష్‌కు బాలీవుడ్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అయితే అత‌డు చేసిన `రాంజనా`, `అత్రంగి రే`, `తేరే ఇష్క్ మే` వంటి చిత్రాలన్నీ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తోనే చేశారు. మొదటిసారి ఆయన కాకుండా భన్సాలీ నిర్మాణంలో ధనుష్ నటించనుండటం విశేషం. ప్రస్తుతం ధనుష్ దక్షిణాదిలో ఉన్న తన ఇతర చిత్రాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో ఈ కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ధనుష్ బాలీవుడ్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తన ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్‌లతో కలిసి `లవ్ అండ్ వార్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కేతన్ మెహతా దర్శకత్వంలో `జై సోమనాథ్` అనే చారిత్రక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ - భన్సాలీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ పౌరాణిక జంగిల్ డ్రామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.