Begin typing your search above and press return to search.

మాస్ హీరో కావాలనే ప్రయత్నంలో.. ధనుష్ తన ప్రత్యేకత కోల్పోతారా?

అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో మారుతున్న మార్కెట్ పరిస్థితులు స్టార్ హీరోల ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయనే చర్చ సాగుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Sept 2026 2:00 PM IST
మాస్ హీరో కావాలనే ప్రయత్నంలో.. ధనుష్ తన ప్రత్యేకత కోల్పోతారా?
X

కోలీవుడ్ లో నటుడిగా ధనుష్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్‌డమ్ కోసం ఒకే తరహా కథలను ఎంచుకునే హీరోల మధ్య, విభిన్న పాత్రలు చేయడమే ధనుష్ కెరీర్‌కు ప్రధాన బలంగా మారింది. సాధారణ యువకుడి పాత్ర నుంచి భారీ ఎమోష‌న్స్ తో కూడిన పాత్రల వరకు, గ్రామీణ నేపథ్యం నుంచి అర్బన్ స్టోరీల వరకు ఆయన చేసిన ప్రయోగాలే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించాయి.

అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో మారుతున్న మార్కెట్ పరిస్థితులు స్టార్ హీరోల ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెరగడంతో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆడియ‌న్స్ అలవాటు పడినప్పటికీ, థియేటర్లకు వచ్చే ఆడియ‌న్స్ మాత్రం భారీ ఎంట‌ర్టైన్మెంట్ ను కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద హీరో సినిమా అంటే యాక్షన్, ఎలివేషన్స్, సాంగ్స్, కామెడీతో కూడిన పూర్తి స్థాయి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలనే అంచనాలు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో ధనుష్ కూడా కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తే అది సహజమైన మార్కెట్ మార్పుగా చూడాలా? లేక ఆయన కెరీర్ ప్రత్యేకతలో మార్పుగా భావించాలా? అనేదే ఆసక్తికరంగా మారింది. ధనుష్‌ను ఇతర స్టార్ హీరోల నుంచి వేరు చేసేది ఆయన కథల ఎంపికే. ప్రేక్షకులకు నచ్చుతుందనే లెక్కలతో మాత్రమే కాకుండా, నటుడిగా తనను కొత్తగా చూపించే పాత్రలకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. అదే ధనుష్‌ను ఒక నటుడిగా స్ట్రాంగ్ గా నిలబెట్టింది. కానీ ఇప్పుడు పూర్తిగా మాస్ ఫార్ములా సినిమాలకే పరిమితమైతే, ఆయనకు ఉన్న ఆ ప్రత్యేక గుర్తింపు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే కమర్షియల్ సినిమా చేయడం తప్పు కాదు. అసలు ఛాలెంజ్ ఏమిటంటే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా ధనుష్ తనదైన ప్రత్యేకతను ఎలా నిలబెట్టుకుంటారన్నదే. అందరూ చేస్తున్న ఫార్ములాను అనుసరించడం కంటే, తన యాక్టింగ్ స్టైల్ కు సరిపోయే కొత్త తరహా కమర్షియల్ కథలను ఎంచుకుంటేనే ఆయనకు నిజమైన స‌క్సెస్ దక్కుతుంది.

ప్రేక్షకుల అభిరుచి మారుతున్న సమయంలో స్టార్ హీరోలు కూడా మారడం సహజమే. కానీ ఆ మార్పులో తమ అసలు బలాన్ని కోల్పోకపోవడం మరింత ముఖ్యం. ధనుష్ విషయంలో ఇప్పుడు ఎదురవుతున్న అసలు పరీక్ష కూడా ఇదే. మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో ఆయన తన ప్రత్యేకమైన నటుడి గుర్తింపును కాపాడుకుంటారా? లేక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? అన్నది రాబోయే సినిమాలే నిర్ణయించనున్నాయి.