జోరు పెంచిన ధనుష్.. ఏకైక నటుడిగా గుర్తింపు?
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు డైరెక్టర్ గా బిజీగా మారిపోయారు.
By: Madhu Reddy | 5 Oct 2025 10:00 PM ISTప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు డైరెక్టర్ గా బిజీగా మారిపోయారు. ఈమధ్య కాలంలో సాధారణంగా హీరోలు ఒక ఏడాదికి ఒక సినిమా చేయడానికే కిందా మీదా పడుతుంటే.. ధనుష్ మాత్రం ఒక వైపు హీరోగా మరొకవైపు దర్శకుడిగా ఏడాదికి మూడు నాలుగు చిత్రాలను విడుదల చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈయన స్పీడ్ చూస్తుంటే.. ఏడాదికి ఐదు సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. పైగా ధనుష్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సినిమాలు విడుదల చేస్తూ..ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటివరకు ఈయన హీరోగా నటించిన చిత్రాలు అలాగే ఈ మధ్య దర్శకత్వం వహిస్తున్న చిత్రాల విషయాన్ని ఒకసారి గమనిస్తే ధనుష్ స్పీడు అందరికీ అర్థమవుతుంది. ఈ ఏడాది ధనుష్ ఏకంగా మూడు రిలీజ్ లతో అభిమానులను కూడా ఆశ్చర్యపరచబోతున్నారు. ఇప్పటికే జూన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక తాజాగా 'ఇడ్లీ కొట్టు' అంటూ అక్టోబర్ ఒకటో తేదీన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. ' ఇడ్లీ కడై' అంటూ తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోగా.. ఇడ్లీ కొట్టు పేరుతో తెలుగులో వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉండగా.. ధనుష్ ఈ ఏడాది నటుడిగా కాకుండా కేవలం దర్శకత్వం మాత్రమే వహించిన చిత్రం ' జాబిలమ్మ నీకు అంత కోపమా.. ' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది ఈ సినిమా. అంటే ఈ స్టార్ హీరో దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. దీనిని అరుదైన విషయం గా కూడా పరిగణించవచ్చు.
2025లో ధనుష్ హంగామా అంతటితో ఆగిపోవట్లేదు. వచ్చే నెలలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇది బాలీవుడ్ చిత్రం కావడం విశేషం. ధనుష్ తో ఇంతకుముందు 'రన్ జానా' ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన ఆనంద్ ఎల్ . రాయ్ దర్శకత్వంలో వస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ నటిస్తూ ఉండగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇకపోతే ఇది విడుదలైన మూడు నెలలకే ధనుష్ నుంచి మరో మూవీ కూడా రాబోతోంది. విగ్నేష్ రాజా అనే యువ దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరిదశకు చేరుకుంది. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో అబ్దుల్ కలాం బయోపిక్ లో కూడా ధనుష్ నటించనున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ధనుష్ ఇలా ఒకవైపు హీరోగా.. మరొకవైపు దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దర్శకుడిగా, హీరోగా ఒకే కాలంలో అత్యధిక చిత్రాలు రిలీజ్ ఇస్తూ ఏకైక నటుడిగా గుర్తింపు అందుకుంటున్నారు.
