'దండోరా' టీజర్.. చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద
అయితే ఇది అందమైన, గ్లామరస్ పల్లెటూరు కాదు. పాతబడిన గోడలు, మట్టి రోడ్లు, సహజమైన లొకేషన్లతో సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్‌గా ఉంది.
By: M Prashanth | 17 Nov 2025 6:32 PM IST'కలర్ ఫోటో' లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. 'దండోరా' పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను లేటెస్ట్ గా విడుదల చేశారు. అయితే ఇది 'కలర్ ఫోటో'లా సాఫ్ట్ లవ్ స్టోరీ కాదు. మొదటి షాట్ నుంచే ఇది చాలా బోల్డ్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండబోతోందని టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు.
ఈ టీజర్ మొత్తం ఒక పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టింది. అయితే ఇది అందమైన, గ్లామరస్ పల్లెటూరు కాదు. పాతబడిన గోడలు, మట్టి రోడ్లు, సహజమైన లొకేషన్లతో సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్‌గా ఉంది. వెంకట్ కెమెరా పనితనం ఆ ఊరిలోని వాతావరణాన్ని, మనుషుల భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు చూపించింది.
ఈ సినిమాలో పెద్ద తారాగణమే ఉంది. ఇద్దరి మధ్య ప్రేమకథతో టీజర్ మొదలవుతుంది. కానీ నవదీప్ ఎంట్రీతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. సీరియస్ లుక్‌లో, ఊరిలో కీలక వ్యక్తిగా నవదీప్ కనిపిస్తున్నాడు. వీరితో పాటు నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనిక రెడ్డి లాంటి చాలా మంది నటులు ఈ కథలో భాగమయ్యారు.
టీజర్ భిన్నమైన లేయర్స్ ని స్పష్టంగా చూపించింది. "లైఫ్" అంటూ మొదలై, మరణం మీదుగా వైపు కథ నడుస్తుందని హింట్ ఇచ్చారు. ముఖ్యంగా ఒక పాత బ్రిడ్జి కింద వేలాడుతున్న ఒక మృతదేహం షాట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. మార్క్ కె. రాబిన్ అందించిన నేపథ్య సంగీతం ఈ టెన్షన్‌ను నెమ్మదిగా పెంచుతూ, పీక్స్‌కు తీసుకెళ్లింది.
టీజర్ మొత్తం ఒక ఎత్తు అయితే, చివర్లో వచ్చే ఒక్క డైలాగ్ మరో ఎత్తు. "చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద" అనే లైన్, సినిమా థీమ్‌ను హైలెట్ చేస్తోంది. ఇది ఎంత లోతైన, బరువైన కథో ఈ ఒక్క డైలాగ్ రుజువు చేస్తోంది. మొత్తం మీద, 'దండోరా' టీజర్ ఒక అందమైన సినిమాను కాకుండా, ఒక నిజాయితీ గల, సీరియస్ డ్రామాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
