నాలోని విప్లవాన్ని బయటకు తీసారు: బిందు మాధవి
తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో నటి బిందుమాధవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన అద్భుతంగా కుదిరింది. వారితో కలిసి సెట్లో సరదాగా గడిచిపోయింది.
By: Sivaji Kontham | 22 Dec 2025 11:28 PM ISTతెలంగాణ గ్రామీణ జీవన శైలి, సామాజిక ఇతివృత్తంపై అరుదైన చిత్రం `దండోరా` ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానే నిర్మించారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందుమాధవి, మౌనికా రెడ్డి తదితరులు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా నైజాం ఏరియాలో సినిమా విడుదల అవుతుంది. విదేశాల్లో సుమారు 200కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నెల 23న ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ అందించిన సంగీతం, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో నటి బిందుమాధవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన అద్భుతంగా కుదిరింది. వారితో కలిసి సెట్లో సరదాగా గడిచిపోయింది. అలాగే ఈ సినిమా పాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్క్ కే రాబిన్ పాటలు వింటుంటే, నిజంగా నాలో దాగి ఉన్న విప్లవాన్ని బయటకు తీస్తున్నారనిపించింది. పాటలు అంత బాగా నచ్చాయి`` అని అన్నారు.
వేదికపై దర్శకుడు మురళీ మాట్లాడుతూ.. దర్శకుడిగా తొలి పరిచయ చిత్రమిది. `కలర్ ఫోటో` సినిమా చేసిన నిర్మాతలకు కథ చెప్పాను. పరిమిత బడ్జెట్లో సినిమా చేయాలనుకున్నాను కానీ.. ఈ కథకు సరిపడేంత బడ్జెట్ ని కేటాయించి బాగా చేద్దామని నిర్మాత అన్నారు. ఈ కథ ఏదో ఒకలా శివాజీ గారి దగ్గరకు వెళ్లింది. ఆయన చాలా బిజీగా ఉన్నా కానీ, కథ విని వెంటనే ఓకే చెప్పారు. చెప్పిన కథను చెప్పినట్టు తీయగలిగితే హిట్టు కొడతావని అన్నారు. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే అందరికీ గురి మరింత పెరిగింది. ఈ కథకు మంచి కాస్టింగ్ కుదిరింది. నా నటీనటుల ప్రదర్శనను తెరపై చూసి ఆడియెన్ చెబుతారు. నేను ఒక డెబ్యూ దర్శకుడిని అయినా అందరూ ఎంతో ప్రోత్సహించారు. శివాజీ గారు ఎంతటి సీనియర్ అయినా కానీ ఎంతో సహనంగా నన్ను ఎంకరేజ్ చేసారు.. అని తెలిపారు. కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. సినిమాలో నటించిన తారలంతా ఈవెంట్ లో సందడి చేసారు.
తెలంగాణ పల్లెలోని రాజకీయాలు, కులం, వెనకబాటుతనం, సామాజిక కట్టుబాట్లపై ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. దండోరా పెద్ద విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు తమ నమ్మకాన్ని కనబరిచారు. శివాజీ లాంటి సీనియర్ నటుడు ఈ సినిమాకి ప్రధాన బలం కానున్నారని దర్శకుడు తెలిపారు. కంటెంట్ ఈ సినిమా విజయానికి ఉపకరిస్తుందని అతిథులు ప్రశంసించారు.
