Begin typing your search above and press return to search.

చాహల్ తో విడాకులపై ధనశ్రీ రియాక్షన్.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు!

ప్రముఖ నటి ధనశ్రీ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే..అయితే ఈ విడాకులపై ఆమె తాజాగా ఓపెన్ అయ్యారు.

By:  Madhu Reddy   |   20 Aug 2025 2:00 PM IST
చాహల్ తో విడాకులపై ధనశ్రీ రియాక్షన్.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు!
X

ప్రముఖ నటి ధనశ్రీ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే..అయితే ఈ విడాకులపై ఆమె తాజాగా ఓపెన్ అయ్యారు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. చాహల్ తో విడాకుల విచారణ జరిగేటప్పుడు కోర్టులో జరిగిన భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ముఖ్యంగా విడాకులు తీసుకోవాలని ముందే డిసైడ్ అయినప్పటికీ.. కోర్టులో ఎందుకో తాను తన భర్త నుంచి విడిపోతుండడంతో తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యానని చెప్పుకొచ్చింది. ఈమె మాటలు బట్టి చూస్తే భర్తతో విడిపోవడం ఇష్టం లేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

కోర్టులో విడాకుల విచారణపై ధనశ్రీ ఎమోషనల్ కామెంట్స్..

విడాకుల విచారణ సమయంలో కోర్టులో ఏం జరిగింది అనే విషయంపై ధన శ్రీ మాట్లాడుతూ.. "విడాకులు తీసుకోవాలని ఇద్దరం ముందే నిర్ణయించుకున్నాము. కానీ కోర్టులో విడాకుల విచారణ జరుగుతున్నప్పుడు అనుకోకుండానే నేను భావోద్వేగానికి గురయ్యాను.అందరి ముందు కేకలు వేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నా లోపల ఏం జరుగుతోందో కూడా బయటకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. దాంతో కేకలు వేస్తూ ఏడుస్తూనే ఉన్నాను. కోర్టు తీర్పు రాగానే చాహల్ ముందుగా బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ఘటన ఇంకా నాకు గుర్తుంది "అంటూ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

టీ షర్టు వివాదంపై కూడా స్పందించిన ధనశ్రీ..

ఇదిలా ఉండగా కోర్టు విచారిస్తున్న సమయంలో చాహల్.. "బి యువర్ ఓన్ షుగర్ డాడీ" అనే టెక్స్ట్ ఉన్న టీ షర్టు ధరించడంతో అది కూడా వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మాట్లాడుతూ.." ఈ షర్ట్ కంటే ముందే ప్రజలు నన్ను నిందిస్తారని తెలుసు. అయితే కోర్టులో చాహల్ టీ షర్టుపై టెక్స్ట్ ను నేను గమనించలేదు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాహల్ షర్ట్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే పర్సనల్గా పంపించాలి కాని ఇలా టీషర్టు రూపంలో సందేశం ఇవ్వడం ఏంటి?" అంటూ కూడా ఆమె ప్రశ్నించింది. అంతేకాదు ఈ విషయంలో ఇంకా పరిణితి చెందాలి అని పరోక్షంగా చాహల్ కి చురకలంటించింది ధనశ్రీ.

ధన శ్రీ కెరియర్..

ధనశ్రీ వర్మ చాహల్ ను 2020లో వివాహం చేసుకున్నారు. మనస్పర్ధలు రావడంతో 2025లో విడాకులు తీసుకొని వివాహ బంధానికి ముగింపు పలికారు. ధనశ్రీ కెరియర్ విషయానికి వస్తే.. దంత వైద్యురాలిగా కెరియర్ ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత డాన్స్, నటనపై మక్కువ ఉండటంతో యూట్యూబ్ ద్వారా మొదట భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత వెండితెరను కెరియర్ గా ఎంచుకున్న ఈమె.. కొరియోగ్రాఫర్ గా మారి పలు చిత్రాలకు పనిచేసింది.అలా 2021 లో వచ్చిన తమిళ చిత్రం 'మాస్టర్' సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది. అలాగే హిందీలోని పలు చిత్రాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసింది ధనశ్రీ.ఆరేళ్ల ప్రాయం నుంచి భరతనాట్యం నేర్చుకున్న ఈమె తన వృత్తిని కొరియోగ్రాఫర్ గా కొనసాగించాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే కొరియోగ్రాఫర్ గానే కాకుండా నటిగా కూడా కెరియర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తెలుగు సినిమా 'ఆకాశం దాటి వస్తావా' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.