Begin typing your search above and press return to search.

'ధమాల్' మేకర్స్‌పై కోటిన్నర మోసం కేసు!

బాలీవుడ్‌ సూపర్ హిట్ కామెడీ చిత్రం 'ధమాల్' సినిమాకు సంబంధించి దర్శకుడు ఇంద్ర కుమార్ -నిర్మాత అశోక్ థాకేరియా చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కుల్లో పడ్డారు.

By:  Srikanth Kontham   |   20 Aug 2026 4:36 PM IST
ధమాల్ మేకర్స్‌పై కోటిన్నర మోసం కేసు!
X

బాలీవుడ్‌ సూపర్ హిట్ కామెడీ చిత్రం 'ధమాల్' సినిమాకు సంబంధించి దర్శకుడు ఇంద్ర కుమార్ -నిర్మాత అశోక్ థాకేరియా చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కుల్లో పడ్డారు. చిత్ర హక్కుల విక్రయంలో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీల మోసం కారణంగా వీరిపై ముంబైలో కేసు నమోదైంది. దీంతో ఈ వివాదం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గ్రాండ్ మాస్టర్ అధినేత వికాస్ బలదేవ్‌రాజ్ సాహ్ని ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 15 2019న తమ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 'ధమాల్' సినిమా ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ , కాపీరైట్ హక్కులను 1.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే ఈ హక్కులు అంతకుముందే మరొక సంస్థకు అమ్ముడుపోయాయని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వివాదం తెరపైకి వచ్చింది. ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సినిమా హక్కులు మరెవరికీ ఇవ్వలేదని నిర్మాతలు తమకు నమ్మబలికారని ఫిర్యాదుదారు తెలిపారు. కానీ నాలుగు సంవత్సరాల ముందే అనగా 2015లోనే ఈ చిత్రానికి సంబంధించిన లైఫ్‌టైమ్ ఓటీటీ ..డిజిటల్ రైట్స్‌ను షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ విషయం తెలియడంతో తమకు కోట్లలో నష్టం వాటిల్లిందని వ్యాపార ఒప్పందాలు రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఇంద్ర కుమార్ - అశోక్ థాకేరియాలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4) - 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసం , ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారనే ఆరోపణల కింద కేసు నమోదు కావడం గమనార్హం. ఈ ఆరోపణలపై మారుతి ఇంటర్నేషనల్ సంస్థ స్పందించింది. సంబంధిత డిస్ట్రిబ్యూటర్ తో చర్చలు జరుగుతున్నాయని హక్కుల వివాదాన్ని పరస్పర అంగీకారంతో త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

మొత్తానికి క్లాసిక్ కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకున్న `ధమాల్` సినిమా హక్కుల వివాదం కోర్టుల వరకు వెళ్లడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ లీగల్ వివాదం నుండి మేకర్స్ ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. `ధ‌మాల్` ప్రాంచైజీ నంచి నాల్గ‌వ భాగం ఈ ఏడాది జులైలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో `ధ‌మాల్ 5` కూడా తెర‌కెక్కించాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది.