క్రిష్ణకు ఎన్టీఆర్ ఇచ్చిన మాట...అద్భుతమైన మల్టీ స్టారర్ మూవీగా !
క్రిష్ణ తన సొంత బేనర్ మీద తీసిన పండంటి కాపురం మూవీ వంద రోజుల వేడుక విజయవాడలో నిర్వహించారు.
By: Satya P | 10 Aug 2026 9:26 AM ISTతెలుగు సినిమాలలో మల్టీ స్టారర్ మూవీస్ కి సరి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసి ఈ రోజుకీ తలమానికంగా నిలిచిన సినిమా దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమానే తరువాత కాలంలో. అంతా మల్టీ స్టార్ మూవీస్ కి ఆదర్శంగా తీసుకుని ఇద్దరి హీరోల పాత్రలను ఎలా డిజైన్ చేయాలి అన్న దానిని పాఠంగా మార్చుకున్నారు. అప్పటికి వంద సినిమాలకు చేరువ అయిన క్రిష్ణ కొత్త తరానికి స్టార్ గా ఎదుగుతున్న నేపథ్యం అది. ఇక ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో పాతికేళ్ళు పూర్తి చేసుకుని రెండు వందల సినిమాలు చేసి టాప్ లెవెల్ స్టార్ గా వెలుగొందుతున్న సమయం అది. ఆ సమయంలో జరిగిన ఒక ముచ్చట తరువాత కాలంలో దేవుడు చేసిన మనుషులు సినిమాగా రూపొందింది.
సినిమా తీస్తే నటిస్తా అంటూ :
క్రిష్ణ తన సొంత బేనర్ మీద తీసిన పండంటి కాపురం మూవీ వంద రోజుల వేడుక విజయవాడలో నిర్వహించారు. దానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిష్ణ సొంత బేనర్ లో సినిమా తీస్తే తాను నటిస్తాను అని సభా ముఖంగానే ప్రకటించారు. ఈ అనూహ్య ప్రకటనతో క్రిష్ణ ఎంతగానో సంతోషించారు. వెంటనే జవాబు చెబుతూ ఎన్టీఆర్ తో తమ సంస్థలో సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఇది జరిగిన తరువాత క్రిష్ణ ఒక డ్యూయెల్ రోల్ కోసం తయారు చేసుకున్న కధలో కీలక మార్పులు చేసి ఎన్టీఆర్ కి అనుగుణంగా పాత్రని క్రియేట్ చేసి ఇద్దరు అన్నదమ్ముల స్టోరీగా దేవుడు చేసిన మనుషులు సినిమాను తీశారు.
హేమా హేమీలతోనే :
పద్మాలయా బేనర్ మీద తీసిన ఈ చిత్రం అత్యంత రిచ్ నెస్ తో ఉండాలని ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు చేశారు. భారీ బడ్జెట్ తో తయారైన ఈ మూవీలో నటించిన ఆర్టిస్టులు అంతా హేమా హేమీలు కావడం విశేషం. ఎస్వీ రంగా రావు, జయలలిత, విజయనిర్మల, జమున, మంజుల కాంచన, జగ్గయ్య, ఎస్ వరలక్ష్మి సత్యనారాయణ, కాంతారావు ఇలా ఎంతో మంది ఈ మూవీ కోసం నటించారు. ఇక ఈ మూవీకి రమేష్ నాయుడు మ్యూజిక్ అందిస్తే క్రిష్ణతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసిన వి రామచంద్రరావు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పక్కా ప్లానింగ్ తో ఈ భారీ తారాగణం ఉన్న సినిమాను చకచకా పూర్తి చేశారు.
బందరు వీధులలో :
ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే దేవుడు చేసిన మనుషుల్లారా అన్న సాంగ్ ని బందర్ వీధులలలో ఆ రోజులలో అవుట్ డోర్ లో చిత్రీకరణ చేశారు. మొత్తం పాటను వేల మంది జనాల మధ్య తీయడం ఎన్టీఆర్ క్రిష్ణ జగ్గయ్య, కాంతారావు వంటి వారు అంతా అవుట్ డోర్ షూటింగ్ లో పాల్గొనడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. క్రిష్ణ నిర్మాణంలో అత్యున్నత విలువలతో రూపొందిన దేవుడు చేసిన మనుషులు చిత్రం 1973 ఆగస్టు 9న రిలీజ్ అయి బంపర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ క్రిష్ణ కాంబోకి జనాలు నీరాజనాలు పలికారు. ఇద్దరు హీరోల అభిమానులు ఎక్కడా ఇబ్బంది పడకుండా కధా కధనాలను నడిపారు. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించిన తరువాత క్రిష్ణ తన వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజుని ప్రకటించారు. దాంతోనే ఎన్టీఆర్ కి క్రిష్ణకు తొలిసారి మనస్పర్థలు వచ్చి మళ్ళీ తొమ్మిదేళ్ళ పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు, తిరిగి 1982లో వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో కలసి నటించే వరకు ఆ గ్యాప్ కొనసాగింది.
