#గుసగుస.. దేవీశ్రీ మ్యూజిక్‌ని- కనగరాజ్ మ్యాజిక్‌ని మిస్సవ్వాలా?
దీనివల్ల ఒక గొప్ప సంగీత దర్శకుడిని, మరో అసాధారణ దర్శకుడి మ్యాజిక్‌ను ప్రజలు కోల్పోవాల్సి వస్తుందేమోననే భయాలు మొదలయ్యాయి.
By: Sivaji Kontham | 1 Jun 2026 3:47 PM ISTచిత్ర పరిశ్రమలో సాంకేతిక రంగాల్లో శిఖరాలను అధిరోహించిన ప్రతిభావంతులు హఠాత్తుగా మరో రంగంలోకి అడుగుపెడితే ఆ ప్రభావం వారి అసలు సిసలైన బ్రాండ్ ఇమేజ్‌పై పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాల విషయంలో ఇదే తరహా ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ దిగ్గజ స్వరకర్తగా దశాబ్దాలుగా యువత హృదయాలను ఏలాడు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌తో కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ సంగీతం, దర్శకత్వం వంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ని పక్కన పెట్టి రంగుల ప్రపంచంలో `హీరోలు`గా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనివల్ల ఒక గొప్ప సంగీత దర్శకుడిని, మరో అసాధారణ దర్శకుడి మ్యాజిక్‌ను ప్రజలు కోల్పోవాల్సి వస్తుందేమోననే భయాలు మొదలయ్యాయి.
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డిఎస్‌పి) ప్రస్తుతం హీరోగా మారుతున్న తొలి చిత్రం 'ఎల్లమ్మ'. ఈ సినిమాతో ఆయన వెండితెరపై నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేవీశ్రీ నటిస్తున్న ఈ 'ఎల్లమ్మ' చిత్రం ఒక విలక్షణమైన కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దేవీశ్రీ పై ప్రీలుక్ గ్లింప్స్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు, ఫస్ట్‌లుక్ - సాంకేతిక నిపుణుల సమాచారాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఒకవేళ అతడు నటిస్తున్న ఈ మొదటి సినిమా సక్సెసై.. హీరోగా వరుస అవకాశాలతో బిజీ అయిపోతే.. అతడి మ్యూజికల్ ట్రీట్ సంగతి ఏమిటనేది ఫ్యాన్స్ ప్రశ్న. దేవీశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ఆల్బమ్స్, మెగా చార్ట్ బస్టర్లు ఇస్తాడని లక్షలాదిగా ఫ్యాన్స్ వేచి చేస్తుంటారు.. కానీ ఆయన పూర్తిస్థాయి నటుడిగా మారితే ఆ మ్యాజికల్ మ్యూజిక్‌ను శ్రోతలు మిస్సయినట్టే.
మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్.సి.యు) నుంచి బోలెడన్ని అద్భుతమైన సినిమాలు ఆశిస్తున్న అభిమానులకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా బిగ్ షాకిచ్చేట్టే కనిపిస్తున్నాడు. లోకేష్ ఇటీవల హీరోగా మారుతున్నాడు. ఆయన హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం `డిసి` (DC). ఈ సినిమా యాక్షన్- సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోందని లోకేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఈ పాత్రను డిజైన్ చేశారని తెలుస్తోంది. వామిక గబ్బి ఇందులో కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ..ఇతర నటీనటుల పూర్తి వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. అయితే లోకేష్ నటన వైపు అడుగులు వేయడం `డిసి` సినిమాలో హీరోగా నటిస్తుండటం అతని దర్శకత్వంపై ప్రభావం చూపుతుందని ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
ఒకవేళ లోకేష్ కనగరాజ్ పొరపాటున నటుడిగా పెద్ద హిట్టు కొట్టి దర్శకత్వానికి దూరమైపోతే పరిస్థితి ఏంటనేది అభిమానుల ప్రధాన ఆందోళన. ఆయన రూపొందించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు `ఖైదీ` సీక్వెల్ లేదా `విక్రమ్` సీక్వెల్ కోసం కళ్లు కాయలు కాసేలా అభిమానులు వేచి చూస్తుంటే అతడు హీరో అయిపోతున్నాడు. రజనీతో `కూలీ` అతడి చివరి సినిమానా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఇప్పటికే `కత్తాలన్` చిత్రంలో ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారని.. ఆ చిత్రానికి సీక్వెల్‌లో ఆయనకు ఏకంగా పూర్తిస్థాయి విలన్ పాత్రను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ అసాధారణ ప్రతిభ గల దర్శకుడనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళ సినిమా రంగానికి ఆయన అందించిన కాంట్రిబ్యూషన్ ఎంతో విలువైనది.
కానీ ఇలా వరుస పెట్టి నటుడిగా అవకాశాలు అందుకుంటే దర్శకత్వం పరిస్థితేమిటీ? అని ఆవేదన చెందుతున్నారు అభిమానులు. `డిసి` సినిమాతో హీరోగా మారి ఆపై వరుస పెట్టి నటనకే లోకేష్ సంతకాలు చేస్తే పరిస్థితి ఏంటనేది అభిమానుల ప్రశ్న. వరుసగా నటనకు సంబంధించిన అసైన్‌మెంట్లను ఒప్పుకోవడం వల్ల ఒక దర్శకుడిగా ఆయనకున్న అసలు సిసలైన గుర్తింపు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటనపైనే లోకేష్ శ్రద్ధ చూపిస్తే భవిష్యత్తులో దర్శకత్వంపై ఆయనకు ఉన్న పట్టు క్రమంగా బలహీనపడవచ్చు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కార్తీ కథానాయకుడిగా రావాల్సిన `ఖైదీ 2` సినిమా భవితవ్యం ప్రస్తుతం సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి వాటాదారుల మధ్య చర్చలు సజావుగా సాగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో లోకేష్ హీరోగా టర్న్ అవ్వడం చూస్తుంటే అసలేం జరుగుతోందో అర్థం కాని గందరగోళం నెలకొంది. సౌత్ లో టెక్నీషియన్లు హీరోలు అవ్వడం ఇప్పుడే కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు లక్ చెక్ చేసుకోవడానికి దూసుకొస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ తమ కొత్త పాత కెరీర్ లను ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.
