Begin typing your search above and press return to search.

హీరోగా దేవి.. సుకుమార్‌ వల్ల కానిది!

హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు టాలీవుడ్లో లేటెస్ట్ హాట్ టాపిక్ ఇదే.

By:  Garuda Media   |   17 Oct 2025 11:58 AM IST
హీరోగా దేవి.. సుకుమార్‌ వల్ల కానిది!
X

హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు టాలీవుడ్లో లేటెస్ట్ హాట్ టాపిక్ ఇదే. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యల్దండి.. దర్శకుడిగా తన రెండో సినిమాగా ‘యల్లమ్మ’ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ముందు నానిని హీరోగా అనుకున్నారు. కానీ అతను స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకో మరో కారణంతోనో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. తర్వాత నితిన్ హీరోగా ఈ సినిమా చేయాలని అనుకున్నారు వేణు, నిర్మాత దిల్ రాజు.

కానీ ‘తమ్ముడు’తో మరో డిజాస్టర్‌ నితిన్ ఖాతాలో పడడంతో లెక్కలు మారిపోయాయి. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. ఇంతలో దేవిశ్రీ ప్రసాద్ ‘యల్లమ్మ’లో లీడ్ రోల్ చేయబోతున్నాడనే వార్త ఇటు ఇండస్ట్రీకి, అటు ప్రేక్షకులకు పెద్ద షాక్‌లాగా తగిలింది. ఇది ఎవ్వరూ ఊహించని ఛాయిస్.

సంగీత దర్శకుడిగా దాదాపు మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న దేవి.. కెరీర్లో ఈ దశలో, ఇలాంటి సినిమాతో హీరో అవుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. మరి ఎలా ఈ ప్రాజెక్టు తన వరకు వెళ్లిందన్నది సస్పెన్స్. అయితే నటుడిగా మారాలన్న దేవి కోరిక ఈ నాటిది అయితే కాదు. సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభమైన తొలి పదేళ్లలోనే అతను హీరోగా సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఛార్మితో కలిసి అతనో సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత, 2019లో దేవి నట అరంగేట్రం గురించి ఒక వార్త బాగా ప్రచారం పొందింది.

దేవిని ఆస్థాన సంగీత దర్శకుడిగా మార్చుకున్న సుకుమార్.. తన సొంత కథతో అతణ్ని హీరోను చేయబోతున్నాడని ఆ టైంలో వార్తలు వచ్చాయి. సుకుమార్ శిష్యుడొకరు దేవి అరంగేట్ర చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని కూడా ప్రచారం సాగింది. అప్పుడు నిర్మాతగా దిల్ రాజు పేరు ప్రచారంలోకి వచ్చింది కూడా. కానీ ఏమైందో తెలియదు. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇప్పుడు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా చాన్నాళ్ల నుంచి వార్తల్లో నానుతున్న ‘యల్లమ్మ’తో దేవి హీరోగా మారబోతున్నాడు.