Begin typing your search above and press return to search.

డీఎస్పీ క్లిక్ అయితే సుకుమార్ దిగుతాడా?

దశాబ్దాల పాటు తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

By:  Srikanth Kontham   |   1 April 2026 5:00 AM IST
డీఎస్పీ క్లిక్ అయితే సుకుమార్ దిగుతాడా?
X

రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ `ఎల్లమ్మ` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. దశాబ్దాల పాటు తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీలో ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఒకవేళ డీఎస్పీ హీరోగా సక్సెస్ అయితే? అతడి స్నేహితు, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఆయనతో సినిమా తీస్తారా? అనేది చ‌ర్చ‌గా మారింది. సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్ మధ్య ఉన్న బంధం కేవలం దర్శకుడు-సంగీత దర్శకుడు మాత్రమే కాదు. ఇద్ద‌రు ఆత్మీయ మిత్రులు.

సుకుమార్ తొలి సినిమా `ఆర్య` నుండి మొన్న‌టి `పుష్ప 2` వరకు ప్రతి చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్స్ అందిం చారు. సుకుమార్ కెరీర్‌లో సాధించిన ప్రతి విజయంలో డీఎస్పీ సంగీతం వెన్నెముకలా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్ అని టాలీవుడ్ లో ముద్ర ప‌డిపోయింది. మ‌రి అదే బ్రాండ్ ఇమేజ్ తో దేవి శ్రీ ప్ర‌సాద్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు అవ‌కాశం ఉందా? అంటే అదంత ఈజీగా జ‌రిగేది కాదు. దేవిశ్రీ ఇప్పుడు న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెడుతున్నాడు. న‌టుడిగా అత‌డు నిల‌దొక్కుకోవాలి. త‌నని తానే స్టార్ గా మార్చుకోవాలి.

బ్యాకెండ్ లో ఎవ‌రి స‌ల‌హాలు తీసుకున్నా? అంతిమంగా ప్రూవ్ చేసుకోవాల్సింది అత‌డే. ఈ విష‌యంలో సుకుమార్ స‌ల‌హాలు ఎలాగూ ఇస్తారు. కానీ నేరుగా సుకుమార్ మాత్రం అప్పుడే ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ తీసుకోరు. నేడు సుకుమార్ పాన్ ఇండియాలో ఓ పెద్ద డైరెక్ట‌ర్. `పుష్ప` సినిమా ఇండియాలో అత‌డి రేంజ్ ను అంత‌కంత‌కు పెంచేసింది. అత‌డితో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ హీరోలే సిద్దంగా ఉన్నారు. బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయాల‌ని సుకుమార్ కూడా ఆస‌క్తిగా ఉన్నారు. అలా కొంత కాలం ప‌ని చేసిన త‌ర్వాత డీఎస్పీతో సినిమా చేసే అవ‌కాశం ఉంటుంది.

అయితే అంత‌కంటే ముందే డీఎస్పీ ఇమేజ్ కు త‌గ్గ క‌థ‌ల‌ను మాత్రం సుకుమార్ స్వ‌యంగా రాసి అందించ‌గ‌ల‌రు. వాటిని త‌న శిష్యులికిచ్చి డైరెక్ట్ చేయించే ఛాన్స్ ఉంది. వాటికి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేయ‌గ‌ల‌రు. సుకుమార్ స్కూల్ నుంచి ఎంతో మంది ప్ర‌తిభావంతులు బ‌య‌ట‌కు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆర‌కంగా డీఎస్పీ కెరీర్ ఆరంభంలో సుకుమార్ స‌హాయం చేయ‌గ‌ల‌రు. అలాగే సుకుమార్ తన సినిమాల్లో హీరోల మేకోవర్‌పై , క్యారెక్టరై జేషన్‌పై చాలా కసరత్తులే చేస్తారు. దేవి శ్రీ ప్రసాద్‌లోని ఎనర్జీ, డాన్స్ స్కిల్స్ , స్టేజ్ ప్రెజెన్స్ గురించి తెలిసిన‌ సుకుమార్ ఆర‌కంగా చాలా వ‌ర‌కూ హెల్ప్ అవుతారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ పూర్తి సినిమా రావాలంటే? అదంతా దేవి శ్రీ స‌క్సెస్ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది.