విజయ్ ఆంటోని, లోకేష్ కనగరాజ్లా దేవీశ్రీ మ్యాజిక్ చేస్తాడా?
సినిమా పరిశ్రమలో ఒక విభాగంలో రాణించిన తర్వాత మరొక విభాగంలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొత్తేమీ కాదు.
By: Sivaji Kontham | 25 Oct 2026 11:00 AM ISTసినిమా పరిశ్రమలో ఒక విభాగంలో రాణించిన తర్వాత మరొక విభాగంలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొత్తేమీ కాదు. దర్శకులు, సంగీత దర్శకులు కేవలం కెమెరా వెనుక పరిమితం కాకుండా.. తమలోని నటుడిని నిరూపించుకోవడానికి హీరోలుగా వెండితెరపై మెరవడం ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారింది. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఇటువంటి ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ `ఎల్లమ్మ` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో అతడు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తారా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తమిళ చిత్రసీమలో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా మారి స్టార్ డమ్ సాధించిన వారిలో విజయ్ ఆంటోని అగ్రస్థానంలో ఉంటారు. `బిచ్చగాడు` (తమిళంలో పిచ్చైక్కారన్) చిత్రంతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఒక్క చిత్రంతో నటుడిగా స్థిరపడిన విజయ్ ఆంటోని.. ఆ తర్వాత వరుసగా నాయకుడిగా నటిస్తూ.. వైవిధ్యమైన కథలతో హీరోగా నిలదొక్కుకోవడంలో విజయం సాధించారు.
అదేబాటలో క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా 2026లో విడుదలైన DC అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో పూర్తిస్థాయి కథానాయకుడిగా అవతారమెత్తారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో `దేవదాస్` అనే పవర్ఫుల్ పాత్రలో లోకేష్ నటనతో ఆకట్టుకున్నారు. క్లాసిక్ దేవదాస్ కథకు `బోనీ అండ్ క్లైడ్` శైలిని జోడించి తీసిన ఈ చిత్రం అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంతో మంచి విజయాన్ని సాధించి 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ లోకేష్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.
ఇప్పుడు ఇదే తరహాలో సౌత్ ఇండియాలోని ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ (DSP) `ఎల్లమ్మ` అనే ప్రతిష్టాత్మక చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. స్టేజ్ ప్రదర్శనలలో తన మ్యూజిక్ వీడియోలలో ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే దేవిశ్రీకి సహజంగానే మంచి టైమింగ్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయి. తనలోని ఈ ప్రతిభను .. బాడీ లాంగ్వేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే.. నటుడిగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
విజయ్ ఆంటోని సాధించిన అతిపెద్ద విజయం.. లోకేష్ కనగరాజ్ `DC` చిత్రంతో కొట్టిన 100 కోట్ల క్లబ్ హిట్లను పరిశీలిస్తే... సరైన కథ, కథనం కుదిరితే కొత్త హీరోలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని స్పష్టమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్.. సంగీత రంగంలో అతడు సాధించిన విజయం `ఎల్లమ్మ` చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి. మంచి కథాబలంతో పాటు తనదైన మార్కు ఎనర్జీతో దేవిశ్రీ ప్రసాద్ కూడా వెండితెరపై సరికొత్త రికార్డులు సృష్టించి.. బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు.
