ఎల్లమ్మ కోసం అంతా రెడీ! డబుల్ ట్రీట్ ఇవ్వనున్న దేవీశ్రీ!
ఈ ప్రాజెక్ట్ కేవలం డెబ్యూ మాత్రమే కాకుండా, డీఎస్పీ కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 6 April 2026 8:00 PM ISTటాలీవుడ్‌లో తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు కెరీర్‌లో కీలక మలుపు తీసుకుంటూ నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా కాలంగా ఉన్న ఈ ఆలోచనను ఆయన ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకువస్తూ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం డెబ్యూ మాత్రమే కాకుండా, డీఎస్పీ కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న దేవీశ్రీ
ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన చేస్తున్న పాత్ర కోసం దేవీ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా స్టేజ్‌పై ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ, తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించే డీఎస్పీ, ఈసారి పూర్తిగా పాత్రలో మునిగిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీపై శ్రద్ధ పెట్టడం ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సీరియస్‌నెస్‌ను చూపిస్తోంది. ఇది ఆయనకు కేవలం ఒక ప్రయోగం కాకుండా, నటుడిగా స్థిరపడాలనే సంకల్పాన్ని సూచిస్తోంది.
తెలంగాణ నేటివిటీతో ఎల్లమ్మ
ఎల్లమ్మ సినిమాకు బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించడం మరో ప్రత్యేక ఆకర్షణ. బలగం సినిమాతో గ్రామీణ నేపథ్య కథను సహజంగా, హృద్యంగా చెప్పగల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వేణు, ఈసారి కూడా తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే కథనే ఎంచుకున్నారు. ఎల్లమ్మ మూవీ పూర్తిగా తెలంగాణ గ్రామీణ సంస్కృతి, ఎమోషన్స్ తో ముడిపడి ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు భారీ గ్రామీణ సెట్‌ను నిర్మించి, ప్రధాన భాగం అక్కడే చిత్రీకరించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
హీరోగానే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తన బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. కంటెంట్‌కి ప్రాధాన్యమిచ్చే ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసే దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఎల్లమ్మపై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. డీఎస్పీ ఈ సినిమాకు హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కు ఇది డబుల్ ట్రీట్ గా మారనుంది.
ఏప్రిల్ 22 నుంచి షూటింగ్
ఈ సినిమా గురించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది. ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్‌లో ఎల్లమ్మ షూటింగ్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై దృష్టి సారించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే హీరోయిన్ ను ఫైనల్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డీఎస్పీ ఈ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వస్తున్న వార్తలు ఎల్లమ్మ స్కేల్‌ను సూచిస్తోంది. మొత్తంగా చూస్తే, సంగీత దర్శకుడిగా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్న దేవి శ్రీ ప్రసాద్, ఇప్పుడు నటుడిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మేకోవర్, ట్రైనింగ్, కథ ఎంపిక ఇవన్నీ కలిపి ఈ సినిమా ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా లేదా అన్నది చూడాలి. అభిమానులు మాత్రం డీఎస్పీని కొత్త అవతారంలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
