మూడు నెలల్లో మూడు.. దేవరకొండ ఫ్యామిలీకి రీసెట్ టైమ్!
ఆనంద్‌కు బేబీ పెద్ద హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన గం గం గణేశా అదే ఊపును కొనసాగించలేదు.
By: M Prashanth | 9 Sept 2026 3:17 PM ISTదేవరకొండ ఫ్యామిలీ నుంచి మూడు నెలల్లో మూడు సినిమాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ ఎపిక్, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ రణబలి, నవంబర్ 27న రష్మిక మందన్న మైసా థియేటర్లలోకి రానున్నాయి. టాక్ కంటే. ముందు వరుస రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ముగ్గురి గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే ఈ మూడు సినిమాలపై ఫోకస్ ఇంకాస్త ఎక్కువగా ఉంది.
ఆనంద్‌కు బేబీ పెద్ద హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన గం గం గణేశా అదే ఊపును కొనసాగించలేదు. ఇప్పుడు ఎపిక్‌లో మళ్లీ వైష్ణవి చైతన్యతో కనిపించబోతున్నాడు. 90స్ ప్రపంచాన్ని ఆదిత్య హాసన్ అదే కథగా తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాకు అదే అసలైన గుర్తింపు. బేబీ జంటను చూడాలనుకునే యూత్ ఒకవైపు, 90స్ చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ మరోవైపు ఉన్నారు. అయితే ఆనంద్‌కు బేబీ తర్వాత మరో బలమైన థియేట్రికల్ రిజల్ట్ కావాలి.
విజయ్ పరిస్థితి ఇంకాస్త వేరు. కింగ్‌డమ్ మంచి ఓపెనింగ్ తీసుకున్నా చివరకు అనుకున్నంత పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్‌తో రణబలి చేస్తున్నాడు. పీరియడ్ యాక్షన్ కథ, పెద్ద కాన్వాస్, రష్మికతో మరో కాంబో అనే అంశాలతో స్కేల్ పెరిగింది. లైగర్ తర్వాత చేసిన భారీ ప్రయత్నాలు విజయ్‌కు అనుకున్న ఫలితం ఇవ్వలేదు. అందుకే రణబలికి ఓపెనింగ్‌తో పాటు మంచి థియేట్రికల్ రన్ కూడా అవసరం.
రష్మికకు స్టార్ హీరోయిన్‌గా పెద్ద హిట్లు ఉన్నా, ఇటీవల వచ్చిన కాక్‌టెయిల్ 2 యావరేజ్ దగ్గరే ఆగింది. మైసాలో మాత్రం కథ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తోంది. ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ పాత్ర చేస్తోంది. ఇక్కడ రష్మికకు హీరో పక్కన ఉండే కమర్షియల్ స్పేస్ లేదు. తన క్రేజ్ తోనే ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావాల్సిన సినిమా ఇది. మైసాతో ఆమె సోలో థియేట్రికల్ మార్కెట్ కూడా బయటపడుతుంది.
మూడు సినిమాలు ఒకే జానర్ లో లేవు. ఎపిక్ యూత్ లవ్ స్టోరీ. రణబలి పీరియడ్ యాక్షన్ డ్రామా. మైసా లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కథ. ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ ఇలా అన్ని రకాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడం అరుదు. ఇక ఎపిక్ నుంచి రణబలికి 35 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. రణబలి వచ్చిన 42 రోజులకే మైసా వస్తోంది. అంటే ఒక సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయి. సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ చివరి వరకు దేవరకొండ సౌండ్ బాక్సాఫీస్ వద్ద వినిపిస్తుంది. కానీ ఫైనల్ గా కంటెంట్ క్లిక్ అవ్వాలి. మరి ఈసారి ఎవరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
