Begin typing your search above and press return to search.

దేవర-2పై ఇప్పటికీ కన్ఫ్యూజనే? అసలు ఉన్నట్లా? లేనట్లా?

అయితే ఇటీవల కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో తన కొత్త సినిమాను ఫిక్స్ చేయడం ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది.

By:  M Prashanth   |   22 May 2026 11:05 AM IST
దేవర-2పై ఇప్పటికీ కన్ఫ్యూజనే? అసలు ఉన్నట్లా? లేనట్లా?
X

టాలీవుడ్‌ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సీక్వెల్స్‌ లో దేవర 2 ఒకటి. మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో, రెండో పార్ట్ పై అభిమానుల్లో హోప్స్ నేచరుల్ గానే పెరిగాయి. అయితే సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు లేకపోవడం, హీరో జూనియర్ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల దేవర 2 నిజంగానే వస్తుందా? లేదా? అనే డౌట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.

అయితే ఇటీవల కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో తన కొత్త సినిమాను ఫిక్స్ చేయడం ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. ఇప్పటికే ఎన్టీఆర్‌ డ్రాగన్‌ వంటి భారీ ప్రాజెక్ట్‌ తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మధ్య వరకు తారక్‌ డేట్స్ ఖాళీగా లేవని తెలుస్తోంది. దీంతో దేవర 2 ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముందుకు కదిలే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో ఇటీవల జరిగిన ఒక చిన్న పరిణామం కూడా అభిమానుల్లో కొత్త డౌట్లకు దారితీసింది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా దేవర నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అయితే అందులో ఎక్కడా దేవర 2 ప్రస్తావన లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. సాధారణంగా పెద్ద సినిమాల సీక్వెల్స్‌ కు సంబంధించి ఇలాంటి సందర్భాల్లో చిన్న హింట్ అయినా ఇస్తారని భావించిన అభిమానులకు, ఈసారి అలాంటి సూచనలు కనిపించలేదు.

అయితే సినీ వర్గాల్లో టాక్ మాత్రం వేరేలా ఉంది. దేవర 2 కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్‌ ను ఎన్టీఆర్‌ కు వినిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ కారణంగా సినిమా ఆలస్యమవుతున్నప్పటికీ, ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోలేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దేవర మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకోవడంతో, సీక్వెల్‌ ను వదిలేసే ఆలోచన మేకర్స్‌ కు లేదని తెలుస్తోంది.

ఇక కొరటాల శివ- బాలకృష్ణ సినిమా కూడా వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక కొరటాల మళ్లీ దేవర 2పై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు సెట్స్‌ పైకి వెళ్తుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎన్టీఆర్‌ లైనప్‌ ను పరిశీలిస్తే డ్రాగన్‌ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కూడా క్యూ‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాలు పూర్తయ్యాకే దేవర 2పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే దేవర సీక్వెల్ 2027 చివర్లో లేదా 2028లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి దేవర 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో పూర్తి నిజం లేదని చెప్పాలి. కానీ ఇప్పటికిప్పుడు సినిమా సెట్స్‌ పైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో అభిమానులు ఇంకొంతకాలం ఓపిక పట్టాల్సిందేనేమో.