దేవర 2 ఆశలు ఆవిరి? సైలెంట్ అయిన మేకర్స్!
జూన్ 15న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు `దేవర 2` పై క్రేజీ అప్‌డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూశారు.
By: Srikanth Kontham | 16 Jun 2026 6:47 PM ISTప్రస్తుతం ఫ్రాంచైజీలు.. సీక్వెల్స్ హవా నడుస్తోంది. భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే దానికి కొనసా గింపుగా పార్ట్ 2 రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తారక్-కొరటాల శివ కాంబినేషన్ లో `దేవర 2` కూడా గ్రాండ్ గా లాంచ్ అవుతుందని అంతా ఆశీస్తున్నారు. కానీ తాజా సన్నివేశాలు చూస్తుంటే? దేవర 2 ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 15న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు `దేవర 2` పై క్రేజీ అప్‌డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూశారు.
కానీ ఈసారి మేకర్స్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాలకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో కేవలం ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు మాత్రమే ఆల్ ది బెస్ట్ చెప్పారు తప్ప ఎక్కడా తమ కాంబినేషన్‌లో రాబోయే సీక్వెల్ ప్రస్తావన తీసుకురాకపోవడం నందమూరి అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిశ్శబ్దానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరీ ఫుల్ కావడమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా `డ్రాగన్` షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది కాలం పాటు కాల్షీట్లను కేటాయించారు. దీని తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ఇతర అగ్ర దర్శకులతో సినిమాలు లైన్లో ఉండటంతో ఇప్పట్లో `దేవర 2` కోసం సమయం కేటాయించడం ఎన్టీఆర్‌కు సాధ్యపడేలా కనిపించడం లేదు. స్క్రిప్ట్ పరంగా కూడా తారక్ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం వేచి చూడకుండా తదుపరి అడుగు వేశారు. నటసింహం బాలకృష్ణతో శివ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (NBK112) ను ఇప్పటికే లాక్ చేసుకున్నారు.
దీంతో కొరటాల శివ పూర్తి దృష్టి బాలయ్య సినిమాపైనే ఉందని స్పష్టమైంది. ఈ చిత్రం పూర్తి కావడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది. కాబట్టి దేవర కథ ప్రస్తుతానికి అసంపూర్తిగానే నిలిచిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సినిమా బిజినెస్ సమీకరణాల పరంగా చూస్తే ఫిక్షనల్ -పీరియాడిక్ డ్రామా లపై ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వస్తోన్న మార్పులు కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. భారీ బడ్జెట్లతో సీక్వెల్స్ ప్లాన్ చేసేటప్పుడు మార్కెట్ రిస్క్.. స్క్రిప్ట్ సంతృప్తి స్థాయిలు చాలా కీలకంగా మారతాయి. `దేవర 1` వాణిజ్యపరంగా మంచి లాభాలను తెచ్చినా? కథలోని లోపాలపై విమర్శలు వచ్చాయి. బహుశా అందుకే పార్ట్ 2 కథను మరింత పకడ్బందీగా మార్చడానికో ? సరైన సమయం కోసం వేచి చూడడానికో? మేకర్స్ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టి ఉండొచ్చని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.
