ఐస్ క్రీమ్ తిని నా భార్య చనిపోయింది.. అసలు విషయం బయట పెట్టిన నటుడు శ్రీనివాసన్!
దేవన్ మాట్లాడుతూ.. "2019లో అలర్జీతో నా భార్య మరణించింది. ఇప్పుడు ఆమెను కోల్పోయి ఆరు సంవత్సరాలకు పైగానే అవుతోంది. వాస్తవానికి ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేది.
By: Madhu Reddy | 12 Sept 2025 1:00 AM ISTఐస్ క్రీమ్ తిని నటుడు భార్య చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా?.. సాధారణంగా కొన్ని కొన్ని విషయాలు అందరికీ సిల్లీ గానే అనిపించినా.. అనుభవించిన వారికే వాటి ఆంతర్యం, నరకం ఏంటో తెలుస్తుంది. సరిగా తన జీవితంలో కూడా అలాగే జరిగింది అని చెబుతున్నారు ప్రముఖ సీనియర్ నటులు దేవన్ శ్రీనివాసన్.. ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని, జీవితాంతం తోడుగా ఉంటాం అనుకున్న భాగస్వామి.. అనూహ్యంగా చిన్న ఐస్ క్రీమ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని తెలిపి మరింత ఎమోషనల్ అయ్యారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
భార్యను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన ఢమరుకం నటుడు..
మలయాళ నటుడుగా పేరు తెచ్చుకున్న దేవన్ శ్రీనివాసన్ తెలుగులో ఏ మాయ చేసావే, మా అన్నయ్య, ఆశయం, పెళ్లి చేసుకుందాం, హార్ట్ ఎటాక్, ఢమరుకం, సాహో వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవన్ శ్రీనివాసన్ ఎక్కువగా విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన విలనిజంతో చూసే ఆడియన్స్ లో కూడా ఆగ్రహాన్ని తెప్పించిన ఈయన.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తన భార్యను గుర్తుచేసుకున్న ఈయన.. తన భార్య మరణానికి అసలు కారణాన్ని చెప్పి ఎమోషనల్ అయ్యారు.
ఐస్ క్రీమ్ తింటే ఆమెకు పడేది కాదు..
దేవన్ మాట్లాడుతూ.. "2019లో అలర్జీతో నా భార్య మరణించింది. ఇప్పుడు ఆమెను కోల్పోయి ఆరు సంవత్సరాలకు పైగానే అవుతోంది. వాస్తవానికి ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేది. కానీ ఐస్ క్రీమ్ తింటే మాత్రం ఆమెకు పడేది కాదు. చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి నేను, నా భార్య బయటకు వెళ్లి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నాము. కాసేపటికి తనకు ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో తృటిలో ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఐస్క్రీం తినకూడదు అని డాక్టర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుంచి ఆమె ఐస్ క్రీమ్ తినడం మానేసింది.
చిన్న తప్పిదం ప్రాణాల మీదకు తెచ్చింది..
అయితే ఒక రోజు నా కూతురు లక్ష్మి తన కూతుర్ని తీసుకొని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను వేరే సినిమా షూటింగ్ కోసం వేరే లొకేషన్ లో ఉన్నాను. ఇంట్లో పిల్లల కోసం తెచ్చిన ఐస్ క్రీమ్ కాస్త మిగలడంతో దానిని అక్కడే వదిలేసి నా కూతురు వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో ఉన్న నా భార్య సుమ డాక్టర్ చెప్పిన మాటను మరిచిపోయి.. దానిని తినింది. ఇక అంతే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే ఇంట్లో పనివాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మగారు కిందపడి గిలగిల కొట్టుకుంటున్నారు అని నాకు చెప్పారు. ఇక నేను ఏం చేయాలో అర్థం కాలేదు.
నా భార్యను కాపాడుకోలేకపోయాను..
వెంటనే ఇంటికి వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. కానీ ఆమెను కాపాడుకోలేకపోయాను. ఐస్ క్రీమ్ అలర్జీ వల్ల ఊపిరితిత్తులలో తనకు రంధ్రాలు ఏర్పడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అలా నేను నా భార్యను కోల్పోవాల్సి వచ్చింది" అంటూ ఎమోషనల్ అయ్యారు దేవన్. మొత్తానికైతే ఐస్ క్రీమ్ వల్ల కూడా ఇలా ప్రాణాలు పోతాయా అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే ఇలాంటి చేదు పరిణామాలే ఎదురవుతాయని పలువురు హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం.
