Begin typing your search above and press return to search.

ఇళ‌య‌రాజాకే షాక్ ఇచ్చిన మ్యూజిక్ కంప‌నీ!

లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

By:  Sivaji Kontham   |   17 Feb 2026 10:09 AM IST
ఇళ‌య‌రాజాకే షాక్ ఇచ్చిన మ్యూజిక్ కంప‌నీ!
X

లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ `సరిగమ` దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆయనపై మధ్యంతర స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని నెల‌లుగా ఇళ‌య‌రాజా త‌న పాట‌ల‌ను కాపీ చేసిన కంపెనీల‌కు వ‌రుస‌గా కోర్టు నోటీసులు పంపుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని తీర్పులు ఇళ‌య‌రాజాకు అనుకూలంగా వచ్చినా, ఇప్పుడు మాత్రం స‌రిగ‌మ కంపెనీ విష‌యంలో ఎదురు దెబ్బ‌ త‌గిలింది.

13 ఫిబ్రవరి 2026న జస్టిస్ తుషార్ రావు గెడెలా ఉత్తర్వు ప్ర‌కారం...సరిగమ సంస్థకు హక్కులు ఉన్న 134 సినిమాలకు సంబంధించిన పాటలు, సౌండ్ రికార్డింగ్‌లను ఇళయరాజా వాడకూడదని.. వాటిని ఇతరులకు లైసెన్స్ ఇవ్వకూడదని కోర్టు ఆదేశించింది. డిజిట‌ల్ వేదిక‌లు అయిన‌ అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియో సావన్ వంటి వేదిక‌ల‌పై ఆయన స్వయంగా అప్‌లోడ్ చేసిన పాటల విషయంలో ఈ స్టే వర్తిస్తుంది. ఈ పాటలపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ఇళయరాజా ఎక్కడా క్లెయిమ్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. నిజానికి ఇది రాజాకు ఊహించ‌ని ఎదురు దెబ్బ‌. ఇంత‌కాలం ఆయ‌న భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని ప్రూవ్ చేసిన సంద‌ర్భంగా భావించాలి.

అస‌లు వివాదం ఎక్క‌డ మొద‌లైంది? అన్న‌ది ప‌రిశీలిస్తే, స‌రిగ‌మ వాద‌న‌ ప్ర‌కారం.. 1976 నుండి 2001 మధ్య కాలంలో ప‌లువురు చిత్ర నిర్మాతల నుంచి తాము ఈ పాటల హక్కులను శాశ్వతంగా కొనుగోలు చేశామని సంస్థ పేర్కొంది. కాపీరైట్ చట్టం ప్రకారం సినిమా పాటలకు నిర్మాతలే మొదటి యజమానులని, వారి నుంచి తాము ఆ హక్కులను పొందామని వాదించారు.

అయితే ఈ పాట‌ల‌ను సృష్టించిన‌ది, సృజ‌నాత్మ‌క‌త త‌మ‌ది అంటూ ఇళ‌య‌రాజా వాదిస్తున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్, రీరిలీజ్ లేదా డిజిట‌ల్ వేదిక‌ల‌పై త‌న పాట‌ల‌ను ప్లే చేయాలంటే కాపీ రైట్ ఉండాల‌ని రాజా ప‌ట్టుబ‌డుతున్నారు. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో ఇళయరాజా ఈ పాటలు తనవేనని పేర్కొంటూ నేరుగా స్ట్రీమింగ్ యాప్స్‌కు లైసెన్స్‌లు ఇచ్చారు. దీనిపై సరిగమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తాజా నోటీసులపై 30 రోజుల్లోగా స్పందించాలని ఇళయరాజాను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ లో జరగనుంది.

గతంలో కూడా ఇళ‌యరాజా ప‌లువురు నిర్మాత‌ల‌పై కోర్టుకెక్కారు. హీరో అజిత్ సినిమాల పాట‌ల‌ విష‌యంలో రాజా కోర్టుకెక్కారు. అయితే `ఎన్ ఇనియ పొన్ నిలవే` అనే పాట విషయంలో రాజాకు వ్య‌తిరేకంగా.. సరిగమకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఇళయరాజా కంపోజ్ చేసిన అనేక క్లాసిక్ హిట్స్ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డాయి. సాగర సంగమం, రుద్రవీణ వంటి చిత్రాల పాటలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. సరిగమ క్లెయిమ్ చేస్తున్న ఆ 134 సినిమాల జాబితాలో తెలుగు సినిమాలు ఉన్నాయి.