Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్ కేసు.. వారికి ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతకు మించి ముప్పు కూడా పొంచి ఉంది.

By:  M Prashanth   |   29 Dec 2025 7:15 PM IST
డీప్ ఫేక్ కేసు.. వారికి ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?
X

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతకు మించి ముప్పు కూడా పొంచి ఉంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఫోటోలు, వాయిస్ లను వారికి సంబంధం లేకుండా వాణిజ్య ప్రకటనల్లో, సోషల్ మీడియా వీడియోల్లో వాడేస్తున్నారు. ఈ తరహా చర్యలు స్టార్ హీరోల ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి హీరోలు న్యాయ పోరాటానికి దిగారు.

ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ముఖచిత్రాలను గానీ, గొంతును గానీ ఎవరూ ఎక్కడా వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ మీడియాలో వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా కోర్టు రక్షణ కల్పించింది. ఈ తీర్పు పట్ల సినీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

లేటెస్ట్ గా ఈ విషయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ప్రొటెక్షన ఆర్డర్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ డిజిటల్ యుగంలో తన పర్సనాలిటీ రైట్స్ అంటే వ్యక్తిత్వ హక్కులు కాపాడేలా రక్షణ కవచం లాంటి తీర్పు ఇచ్చినందుకు గౌరవ న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో తనకు అండగా నిలిచిన న్యాయవాదులను కూడా తారక్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా దాకర్ తో పాటు మిస్టర్ రాజేందర్, రైట్స్ అండ్ మార్క్స్ టీమ్ అందించిన లీగల్ సపోర్ట్ మరువలేనిదని కొనియాడారు. వారి అంకితభావం వల్లే ఈరోజు ఈ తీర్పు సాధ్యమైందని ఎన్టీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ కు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసేవారికి గట్టి హెచ్చరిక అని చెప్పాలి. ఇకపై తారక్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్ ను కమర్షియల్ గా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు. కేవలం ఎన్టీఆర్ కే కాకుండా మిగిలిన నటీనటులకు కూడా ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.