ఇకపై పర్మిషన్ లేకుండా NTR పేరు వాడితే చర్యలు.. హైకోర్టు కీలక తీర్పు
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాడుతున్న డిజిటల్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
By: M Prashanth | 29 Jan 2026 3:20 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాడుతున్న డిజిటల్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ప్రచార హక్కులకు (పర్సనాలిటీ & పబ్లిసిటీ రైట్స్) చట్టపరమైన పూర్తి రక్షణ కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
అయితే తన పేరు, ఇమేజ్, ట్యాగ్స్ ను సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, డిజిటల్ ప్రకటనలు సహా పలు విధాలుగా అనధికారికంగా వాడుతున్నారంటూ ఎన్టీఆర్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన కోర్టు, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ అని తెలిపింది. అంతే కాదు.. ఆయన పేరు, గుర్తింపునకు కమర్షియల్ వాల్యూ ఉందని స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ ను ప్రజలు ఎన్టీఆర్, తారక్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు జూనియర్ అనే పేర్లతో పాటు యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి ట్యాగ్స్ తో గుర్తిస్తారని కోర్టు పేర్కొంది. ఆ పేర్లు, ట్యాగ్స్ పూర్తిగా ఆయన వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్నాయని వెల్లడించింది. అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫోటోలు లేదా గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది.
ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాంలలో ఉంటే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో కూడా ఈ తరహా దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో కీలక అంశం ఏమిటంటే.. గుర్తుతెలియని వ్యక్తులు కూడా ఎన్టీఆర్ పేరు లేదా ఇమేజ్ ను వాడుకుని మోసం చేస్తే వారిపైన కూడా ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
ఎవరైనా ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తే లేదా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్టీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తూ.. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు, అనుమతి లేని ప్రమోషన్లు పెరిగిపోయాయని తెలిపారు. ఇవి కేవలం ఆర్థిక నష్టం చేకూర్చడమే కాకుండా, నటుడి వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా హానికరమని పేర్కొన్నారు.
వాదనలను అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు.. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఒక ప్రముఖ వ్యక్తి పేరు, ఇమేజ్ కూడా వారి వ్యక్తిగత ఆస్తి లాంటిదేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు డిజిటల్ దుర్వినియోగానికి చెక్ పెట్టే కీలక నిర్ణయంగా అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు సెక్యూరిటీగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
