Begin typing your search above and press return to search.

ఎంత చంపాలని చూసినా 'దీవాన' మాత్రం.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన 'దీవాన' మూవీ విడుదలైన తర్వాత దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

By:  M Prashanth   |   26 Jun 2026 6:40 PM IST
ఎంత చంపాలని చూసినా దీవాన మాత్రం.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన 'దీవాన' మూవీ విడుదలైన తర్వాత దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమాకు సంబంధించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఆయన భావోద్వేగంతో స్పందించారు. కొందరు కావాలనే దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. థ్యాంక్యూ మీట్ వేదికగా చేసిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఆ చిత్రంలో హర్షిత్ రెడ్డికి జోడీగా స్మేహ మణిమేగలై నటించింది. దర్శకుడిగా శ్రీకాంత్ సంగిశెట్టి ఆ మూవీతోనే పరిచయం అయ్యారు .జూన్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. విడుదల తర్వాత మంచి స్పందన వస్తోందని చెబుతున్న మూవీ టీమ్ తాజాగా థ్యాంక్యూ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు.. "దీవాన సినిమాను ఎందుకు నెగిటివ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రేమ గురించి చెప్పే ఒక పాట గుర్తొస్తుంది. ప్రేమించుకోవడం పాపమా అన్నట్లుగా సినిమాను చంపాలని చూస్తున్నారు. కానీ ఎంత చంపాలని చూసినా 'దీవాన' మళ్లీ లేస్తూనే ఉంటుంది. సలీం-అనార్కలి స్టోరీ కంటే దీవాన నాకు గొప్పది" అంటూ వ్యాఖ్యానించారు.

ఇటీవల సక్సెస్ మీట్ లో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని శ్రీకాంత్ చెప్పారు. "మా సినిమాలో రియాలిటీతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. కేజీఎఫ్‌ లో ఎలివేషన్ సీన్స్‌ కు వచ్చిన రెస్పాన్స్ లాగే మా సినిమాలో చిన్న చిన్న డైలాగ్‌ లకూ ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. హీరో, హీరోయిన్ అనుభవించే బాధను ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు. చాలామంది భావోద్వేగానికి గురవుతున్నారు" అని తెలిపారు.

తెలుగు సినిమా గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శకుడు ఆరోపించారు. "మన భాష, మన నేటివిటీ తెలియని వారు సెన్సార్ కట్స్ ద్వారా సినిమా అసలు భావాన్ని దెబ్బతీస్తున్నారు. మరోవైపు బాంబే నుంచి కొందరు తెలుగు సినిమాను తక్కువ చేసి చూపించేలా రివ్యూలు ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెబుతాను. గత పదేళ్లలో తెలుగులో ఇలాంటి ప్రేమకథ రాలేదు" అంటూ ధీమా వ్యక్తం చేశారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మున్నా అనే నిర్లక్ష్యంగా జీవించే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రులపై ఆధారపడుతూ స్నేహితులతో గడిపే మున్నా, అమూల్య అనే యువతిని ప్రేమిస్తాడు. ఆమె మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే తన ప్రేమను పరిశీలిస్తానని షరతు పెడుతుంది.

దీంతో ప్రేమ కోసం జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్న మున్నా ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అయితే అనుకోని సంఘటనలు కారణంగా అతను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అక్కడి నుంచి అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? ప్రభుత్వ ఉద్యోగం సాధించాడా? అమూల్య ప్రేమను గెలుచుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే దీవాన సినిమా.