మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ.. అవయవ దానం చేసిన డైరెక్టర్ భార్య!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం సతీమణి, ప్రముఖ సామాజిక మరియు పర్యావరణ మహిళా పారిశ్రామికవేత్త దీప్తి రెడ్డి మాడుగుల అకస్మాత్తుగా అనారోగ్యంతో కన్నుమూయడం టాలీవుడ్ మరియు వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
By: Madhu Reddy | 27 Sept 2026 10:18 AM ISTటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం సతీమణి, ప్రముఖ సామాజిక మరియు పర్యావరణ మహిళా పారిశ్రామికవేత్త దీప్తి రెడ్డి మాడుగుల అకస్మాత్తుగా అనారోగ్యంతో కన్నుమూయడం టాలీవుడ్ మరియు వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఆమె మరణం తర్వాత తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ద్వారా నలుగురికి పునర్జన్మను ప్రసాదించారు. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ తన అవయవాలను దానం చేసి మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు.
మహిళా సాధికారతకు పెద్దపీట:
దీప్తి రెడ్డి కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, సమాజం కోసం ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి 'ఉమెనర్జీ' సంస్థను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. అలాగే మహిళా స్టార్టప్‌ల కోసం 'తెలంగాణ ఏంజెల్స్' ప్రారంభించి ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఇక ఆమె చేసిన విశేష కృషికి గాను 2025లో ప్రతిష్టాత్మక 'మాతృశక్తి అవార్డు'ను కూడా అందుకున్నారు.
పర్యావరణహిత జీవనశైలికి ప్రచారం "
వ్యాపార రంగంలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం 'ఇధ్య ఎకో లివింగ్' ద్వారా ఎకో-ఫ్రెండ్లీ జీవనశైలిని ప్రోత్సహించారు. అలాగే 'OG నేచురల్ ఫుడ్స్' మరియు 'జీవతి ఆర్గానిక్' స్టోర్ల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక పర్యావరణంపై ఆమె చూపిన ప్రేమ అందరినీ ఆకట్టుకునేది.
మరణంలోనూ జీవనాన్ని పంచిన వైనం:
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దీప్తి రెడ్డిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలోనూ ఆమె గతంలో తీసుకున్న అవయవ దాన ప్రతిజ్ఞను కుటుంబ సభ్యులు గౌరవించారు. ఇక విరాట్ ఫౌండేషన్ సహకారంతో 'జీవన్‌దాన్' ద్వారా ఆమె అవయవాలను దానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న మరికొందరి జీవితాల్లో ఆమె వెలుగులు నింపారు.
దర్శకుడు ప్రదీప్ అద్వైతం కుటుంబంలో విషాదం:
'ఛాంపియన్' వంటి మంచి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ అద్వైతం సతీమణి దీప్తి రెడ్డి మృతి చెందడం చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె చేసిన సేవలు, అవయవ దానం రూపంలో ఆమె ఆశయాలు ఎప్పటికీ జీవించే ఉంటాయి.
ఇక మనం ఈ భూమిపై ఎంతకాలం ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎంత మంచి జ్ఞాపకాలను, ఆశయాలను మిగిల్చామనేదే ముఖ్యం. దీప్తి రెడ్డి తన జీవితంలోనూ, చివరి క్షణంలోనూ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఆమె అందించిన ప్రాణదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
