దీప్ వీర్‌కి అసలేమైంది.. ఎందుకు ఇలా అవుతోంది?
బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే ఇటీవల ఊహించని పరిణామాల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 25 Sept 2025 11:19 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే ఇటీవల ఊహించని పరిణామాల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రెండు భారీ చిత్రాల్లో అవకాశాలను కోల్పోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. భారతదేశంలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్‌గా వెలిగిపోతున్న ప్రభాస్ సరసన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా, వాటిని కాలదన్నుకుంది. సందీప్ వంగా `స్పిరిట్`, నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఎడి` సీక్వెల్ చిత్రాల నుంచి తొలగిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. కేవలం ఈ రెండు పెద్ద అవకాశాల రూపంలో దీపిక పదుకొనే దాదాపు 40 కోట్ల మేర పారితోషికాలను కోల్పోయింది. అదే సమయంలో భారీ కార్పొరెట్ బ్రాండ్లు దీపికను కాదని ఆలియా లాటి కథానాయికను వరిస్తుండడం షాకింగ్ గా మారింది. ప్రఖ్యాత గూచీ బ్రాండ్ కి ఒకప్పుడు దీపిక పదుకొనే ప్రచారకర్త. కానీ ఇటీవల ఆలియా భట్ ని సదరు బ్రాండ్ ప్రచార కర్తగా ఎంపిక చేసుకుంది.
ఓవైపు దీపిక పరిస్థితి ఇలా ఉండగానే, మరోవైపు రణ్ వీర్ సింగ్ వరుసగా క్రేజీ చిత్రాలలో అవకాశాల్ని కోల్పోతున్నారు. శంకర్ దర్శకత్వంలో `అపరిచితుడు` రీమేక్ లో నటించాల్సి ఉన్నా ఫెయిలయ్యారు. ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా అటకెక్కింది. ఆ తర్వాత హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న బ్రహ్మ రక్షస్‌లో రణవీర్ సింగ్ నటించాల్సి ఉన్నా సృజనాత్మక విభేధాల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారమైంది. ఆ తర్వాత కూడా రణ్ వీర్ నటించాల్సిన కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఊహించని కారణాలతో ఆగిపోయాయి.
ఇటీవల చాలాకాలంగా శక్తిమాన్ గా నటిస్తాడని ప్రచారమైంది. కానీ ఈ ప్రాజెక్ట్ అంతకంతకు టేకాఫ్ అవ్వడం ఆలస్యమైంది. ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైందని ప్రచారం సాగుతోంది. దీనికి కారణం మాతృక ఫిలింమేకర్ ముఖేష్ ఖన్నా ఈ సినిమా రైట్స్ ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ శక్తిమాన్ గా నటిస్తే ఒక దక్షిణాది స్టార్ నటించే అవకాశం ఉందని కూడా అతడు రణ్ వీర్ సింగ్ ని అవమానించినట్టు కథనాలొచ్చాయి. శక్తిమాన్ రీమేక్ రైట్స్ కోసం రణ్ వీర్ సింగ్ ఎంతగా బతిమాలినా ముఖేష్ ఖన్నా అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దీనికి తోడు శక్తిమాన్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో రణ్ వీర్ కి క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయన్న మరో పుకార్ కూడా వైరల్ గా మారుతోంది. కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా లేనట్టేనని ప్రచారం సాగుతోంది. అయితే శక్తిమాన్ ప్రాజెక్ట్ ఉందా లేదా? అన్నదానిపై ఇంకా రణ్ వీర్ వైపు నుంచి స్పష్ఠత రాలేదు.
ప్రస్తుతానికి రణ్ వీర్ హోప్స్ అన్నీ ధురంధర్ పైనే. ఈ సినిమాకి యూరి ఫేం ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలున్నాయి. అలాగే డాన్ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం `డాన్ 3`లో నటించేందుకు రణ్ వీర్ సిద్ధమవుతున్నాడు. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
