Begin typing your search above and press return to search.

'స్పిరిట్‌'ని వెంటాడుతున్న దీపిక వివాదం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ మూవీ `స్పిరిట్‌`. సందీప్‌రెడ్డి వంగ‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

By:  Ravindar Gorantla   |   9 March 2026 12:00 AM IST
స్పిరిట్‌ని వెంటాడుతున్న దీపిక వివాదం!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ మూవీ `స్పిరిట్‌`. సందీప్‌రెడ్డి వంగ‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌భాస్ తొలి సారి ప‌వర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ముందు దీపికా ప‌దుకునే హీరోయిన్‌. కానీ ప‌ని గంట‌ల కార‌ణంగా త‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రిగింది. దీనిపై దీపిక ఆస‌క్తిక‌రంగా స్పందించింది కూడా ఆత్మాభిమానం ఉన్న న‌టిగా న‌న్ను ఇబ్బందిపెట్టే వాటిని నేను అంగీక‌రించను అన్నారు.

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది సూప‌ర్ స్టార్‌లు, అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంట‌లు మాత్ర‌మే ప‌ని చేస్తున్నారు. ఇదేం ర‌హ‌స్యం కాదు. కానీ ఇన్నేళ్ల‌లో ఈ విష‌యం ఎప్పుడూ వార్త‌ల్లో నిలవ‌లేదు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే విష‌యం త‌ప్పుదోవ ప‌డుతుంది. అందుకే వాళ్ల పేర్లు చెప్పాల‌నుకోవ‌డం లేదు. కానీ చాలా మంది హీరోలు 8 గంట‌లే ప‌నిచేస్తార‌న్న‌ది అందరికి తెలిసిన విష‌య‌మే. అంతే కాదు వారిలో చాలా మంది సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు మాత్ర‌మే షూటింగ్‌ల‌లో పాల్గొంటారు. వారాంతాల్లో ప‌ని చేయ‌రు` అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది.

సూప‌ర్ స్టార్ల‌కు ఒక న్యాయం, హీరోయిన్‌ల‌కు ఒక న్యాయ‌మా? అంటూ ప్ర‌శ్నించింది. ఈ వివాదం ముగిసి `స్పిరిట్‌` టీమ్ దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రీని ఫైన‌ల్ చేసుకుని షూటింగ్ కూడా మొద‌లు పెట్టేసినా ఇప్ప‌టికీ దీపిక వివాదం `స్పిరిట్‌`ని వెంటాడుతూనే ఉంది. దీపిక వివాదంపై నెట్టింట గ‌తంలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. త‌న‌ని స‌పోర్ట్ చేసిన వారు కొంద‌రైతే `స్పిరిట్‌` టీమ్‌కు స‌పోర్ట్‌గా నిలిచిన వారు మ‌రి కొంద‌రు. భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు ప‌ని గంట‌ల విష‌యంలో శ‌ర‌తులు విధించ‌డం క‌రెక్ట్ కాద‌ని కొంద‌రు, దీపికి ఇటీవ‌లే త‌ల్లైంది కాబ‌ట్టి ఆమెకు ప‌ని గంట‌ల విష‌యంలో వెసులు బాటు క‌ల్పించాల‌ని మరి కొంద‌రు వాధించారు.

తాజాగా ఈ వివాదంపై క‌రీనా క‌పూర్ ఇండైరెక్ట్‌గా స్పందించారు. వ‌ర్క్ లైఫ్ స‌మ‌తుల్య‌త గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు, ఇద్ద‌రు పిల్ల‌ల‌ని చూసుకునే స‌మ‌యంలోనూ వ‌ర్క్ లైఫ్‌ని స‌మ‌తుల్యంగా ఉండేలా చూసుకున్నాను. దానికి నా జీవిత‌ భాగ‌స్వామి ఇచ్చిన మ‌ద్ద‌తు ముఖ్య పాత్ర పోషించిందని తెలిపింది. అంతే కాకుండా అంగీక‌రించిన సినిమా షెడ్యూల్స్ విష‌యంలో ప్రొడ్యూస‌ర్స్‌తో పూర్తి స్ప‌ష్ట‌త క‌లిగి ఉన్నాన‌ని తెలిసింది. న‌టీన‌టుల‌కు వృత్తిప‌ర‌మైన క‌ట్టుబాట్లు ముఖ్య‌మైన‌వేన‌ని చెబుతూనే కుటుంబానికి స‌మ‌యాన్ని కేటాయించ‌డం కూడా ప్ర‌ధానం అని స్ప‌ష్టం చేసింది.

అన‌న్య పాండే కూడా దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. దీపికి అంకిత భావం ఉన్న న‌టి. నేను ఆమెతో క‌లిసి `గెహ్రెయాన్‌`లో న‌టించాను. అప్పుడు దీపిక ఎలాంటి డిమాండ్‌లు చేయ‌లేదు. వ‌ర్క్ షాప్‌ల‌కు కూడా వ‌చ్చేవారు. షూటింగ్ విష‌యంలో త‌ను ఎప్పుడూ ఫిర్యాదులు చేయ‌లేదు. ఇప్పుడు ఆమె ఒక బిడ్డ‌కు త‌ల్లి. ఆ పాప‌కు క‌నీసం రెండేళ్ల వ‌ర‌కు అయినా దీపిక అవ‌స‌రం ఉంది. అందుకే ఇప్పుడు ఇలాంటి డిమాండ్ చేసింది. ఇందులో త‌ప్పేం లేదు. దీపిక త‌ల్లైన త‌రువాత ఇండ‌స్ట్రీలో ఉన్న పాత ఆలోచ‌న‌ను మార్చేశారు. ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్పుడు వ‌స్తున్న హీరోయిన్‌ల‌కు ధైర్యాన్నిస్తున్నాయి.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ త‌మ వ్య‌క్తిగ‌త జీవితానికి, వృత్తిప‌ర‌మైన స‌మ‌తుల్య‌త పాటించేలా నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంలో ఎలాంటి త‌ప్పులేదని అన‌న్య పేర్కొంది. దీంతో మ‌రోసారి `స్పిరిట్‌` దీపిక వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికీ `స్పిరిట్` వివాదం వైర‌ల్ అవుతోందంటే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌ని గంట‌ల వివాదం ఇంకా ప‌రిష్కారం కాలేద‌ని, చాలా మంది న‌టీన‌టులు దీనిపై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతూనే ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ స‌మ‌స్య కొలిక్కి రానంత వ‌ర‌కు `స్పిరిట్‌` వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది.