500 కోట్ల బడ్జెట్ సినిమాలు అవసరం లేదు: దీపిక
అంతేకాదు పిల్లలను ఆన్ లొకేషన్ కి తీసుకుని రావాలని, అక్కడ నిర్మాతలు వారికి వసతులు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తోంది.
By: Sivaji Kontham | 19 Nov 2025 7:21 PM ISTపిల్లల తల్లులు (ఆర్టిస్టులు) ఆన్ లొకేషన్‌లో ఇబ్బంది పడకూడదని, తమ బిడ్డ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నందున పరిమిత సమయం మాత్రమే పనికి అందుబాటులో ఉండటం సబబు అని వాదిస్తోంది దీపిక పదుకొనే. అంతేకాదు పిల్లలను ఆన్ లొకేషన్ కి తీసుకుని రావాలని, అక్కడ నిర్మాతలు వారికి వసతులు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఈ డిబేట్ దీపిక రెండు భారీ అవకాశాలను కోల్పోయాక మరింత ఎక్కువైంది. నిజానికి సందీప్ వంగా `స్పిరిట్`కి ఎంపికైనప్పుడు తాను ఆన్ లొకేషన్ కేవలం 6 గం.లు మాత్రమే పని చేస్తానని దీపిక పట్టుబట్టినట్టు కథనాలొచ్చాయి. భారీ పారితోషికం డిమాండ్ చేయడమే గాక, తన 25 మంది సిబ్బందికి స్టార్ హోటల్ సౌకర్యాలు, ప్రయాణాలు వగైరా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసినట్టు కూడా కథనాలొచ్చాయి. అయితే చాలా మీడియాలు వీటిని అంతగా పట్టించుకోలేదు. కేవలం దీపిక 8గంటల పనిదినం అడిగినందుకు దర్శకుడు వంగా తొలగించాడని నిందిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా- స్పిరిట్ నుంచి తొలగించిన తర్వాత కల్కి 2898 ఏడి నుంచి కూడా దీపికను తొలగిస్తూ, వైజయంతి మూవీస్ ప్రకటన వెలువరించడం బిగ్ షాక్. దీపిక గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక వారంతా తెగ తెంపులు చేసుకున్నారని కథనాలొచ్చాయి.
ఆ తర్వాత దీపికకు సపోర్ట్‌గా ఒక వర్గం, వ్యతిరేకంగా ఇంకో వర్గం రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇది ఆన్ లైన్‌లో నిరంతర డిబేట్‌గా మారింది. తాను ఎనిమిది గంటల పని దినానికే కట్టుబడి ఉన్నానని ప్రతిసారీ వేదికలపై ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది దీపిక. అలాగే తన సొంత ఆఫీసుల్లో మహిళలకు ఇలాంటి వెసులుబాటు కల్పించానని, ఈ రూల్ అందరికీ వర్తింపజేయాలని కూడా పోరాడుతోంది. అలాగే పిల్లల తల్లుల శారీరక శ్రేయస్సు, మానసిక శ్రేయస్సు ఆవశ్యకత గురించి ప్రపంచానికి దీపిక చాటుతోంది.
`బజార్ ఇండియా` నవంబర్ 2025 కవర్ పేజీపై కనిపించిన దీపిక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 500 కోట్ల రేంజు భారీ బడ్జెట్ చిత్రాలలో నటించాలని అనుకోవడం లేదని, తనకు సౌకర్యం ఉన్నవాటిని మాత్రమే ఎంచుకుంటానని పేర్కొంది. తన ప్రాధాన్యతలు మరింత మారాయని, ప్రాజెక్టులు చేజారడంపై విచారం లేదని పేర్కొంది. ఇప్పుడు మరింత సెలక్టివ్ గా మాత్రమే ఉన్నానని తెలిపింది. దీపిక ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ తో పాటు షారూఖ్ ఖాన్ కింగ్ చిత్రంలోను నటిస్తోంది.
