ప్రెగ్నెన్సీతో దీపికా పదుకొణె కఠోర శ్రమ..ఆ డెడికేషన్‌కు ఫిదా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తి విషయంలో ఎంతగా నిబద్ధతతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sivaji Kontham | 27 April 2026 9:42 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తి విషయంలో ఎంతగా నిబద్ధతతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పనిని ఎంతో ప్రణాళికాబద్ధంగా ముగించే ఈ నటి ప్రస్తుతం తన రెండో ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఏమాత్రం తగ్గకుండా పని చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఈ రెండో గర్భం అనుకోకుండా వచ్చిన తీపి కబురని.. రణవీర్ సింగ్ - దీపికా ఈ వార్త తెలిసి ఎంతో ఆశ్చర్యపోయారని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రణాళిక లేకపోయినా.. వచ్చిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తూనే తన కెరీర్ మ్యాటర్ లో దీపిక చూపిస్తున్న అంకితభావం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం దీపికా ఆరున్నర నెలల గర్భవతి అని సమాచారం. అయితే తన వల్ల ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దీపిక స్వయంగా మేకర్స్‌కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారట. షెడ్యూల్స్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటానని మాటివ్వడం తన వృత్తి ధర్మానికి నిదర్శనం. ప్రస్తుతం దీపిక దక్షిణాఫ్రికాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి `కింగ్` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాట సహా కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా నటించబోతుండటం విశేషం.
దక్షిణాఫ్రికా షెడ్యూల్ ముగించుకుని భారత్ రాగానే.. దీపికా నేరుగా అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన `రాక` షూటింగ్‌లో పాల్గొననున్నారు. ముంబైలో జరగనున్న ఈ షెడ్యూల్ కోసం సుమారు 50 నుంచి 60 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. గర్భవతి అయిన కారణంగా సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గుతుందనే ప్రచారంలో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. మొదట అనుకున్న విధంగానే తన పాత్ర ఉంటుందని.. మరికొద్ది నెలల్లో కొన్ని కీలక యాక్షన్ సీన్లు కూడా దీపికపై చిత్రీకరించనున్నారని సమాచారం.
దీపికాకు ఇలాంటి సాహసాలు కొత్తేమీ కాదు. 2024లో తన మొదటి సంతానం దువా జన్మించకముందు.. నాలుగు నెలల గర్భంతో ఉన్నప్పుడే రోహిత్ శెట్టి `సింగం అగైన్` చిత్రం కోసం కఠినమైన యాక్షన్ సీన్లు చేశారు. ఆ సమయంలోనే దర్శకుడు రోహిత్ శెట్టి దీపిక ప్రొఫెషనలిజం గురించి గొప్పగా చెప్పారు. ఇప్పుడు రెండోసారి కూడా అదే స్థాయి పట్టుదలతో పని చేస్తుండటం చూస్తుంటే.. నంబర్ వన్ హీరోయిన్లు ఎందుకు అవుతారో దీపిక నిరూపిస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరో ఆరు నెలల్లో పాపాయి రాక కోసం ఎదురుచూస్తూనే.. మరోవైపు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ చిత్రాల షూటింగ్స్‌తో దీపికా ఫుల్ బిజీగా ఉంది. కమర్షియల్ యాడ్స్.. సినిమా షూటింగ్స్ మధ్య దీపిక బిజీగా గడుపుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే అలసటను పక్కన పెట్టి ..`రాక`వంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాల్లో నటించాలనే పట్టుదలను కనబరుస్తున్న తీరు .. ఆ డెడికేషన్ ముందు ఏవైనా దిగదుడుపేనని అనిపిస్తోంది.
