Begin typing your search above and press return to search.

40 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం దాల్చిన దీపికా పదుకొనే.. లేట్ ప్రెగ్నెన్సీ రిస్క్స్ ఏంటి?

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోణే, రణవీర్ సింగ్ తమ రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   20 April 2026 3:00 PM IST
40 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం దాల్చిన దీపికా పదుకొనే.. లేట్ ప్రెగ్నెన్సీ రిస్క్స్ ఏంటి?
X

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోణే, రణవీర్ సింగ్ తమ రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి బిడ్డ 'దువా' పుట్టిన కొద్ది కాలానికే ఈ గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. అయితే 40 ఏళ్ల వయసులో దీపికా రెండోసారి తల్లి కాబోతుండటంతో, ఇప్పుడు 'లేట్ ప్రెగ్నెన్సీ' గురించి చర్చ మొదలైంది. కెరీర్ ప్లానింగ్ వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆలస్యంగా గర్భం దాల్చుతున్నారు. మరి ఈ వయసులో వచ్చే ఇబ్బందులేంటో ఒకసారి చూద్దాం.

పెరిగే రక్తపోటు.. ప్రీ-ఎక్లాంప్సియా ముప్పు:

సాధారణంగా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడాన్ని వైద్య పరిభాషలో అడ్వాన్స్‌డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటారు. వయసు పెరిగే కొద్దీ మన రక్త నాళాల్లో మునుపటిలా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దీనివల్ల గర్భిణీలలో రక్తపోటు (బిపి) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక దీనినే 'ప్రీ-ఎక్లాంప్సియా' అంటారు. ఇది కేవలం తల్లికే కాకుండా, లోపల ఉన్న బిడ్డకు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. సరైన సమయంలో దీన్ని గుర్తించకపోతే కిడ్నీలు, లివర్ వంటి అవయవాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 35 దాటిన వారు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

షుగర్ లెవల్స్ జాగ్రత్త.. జెస్టేషనల్ డయాబెటిస్:

వయసుతో పాటు శరీరంలో జీవక్రియలు కూడా మారిపోతాయి. ముఖ్యంగా లేట్ ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి 'జెస్టేషనల్ డయాబెటిస్' వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు కలగడమే కాకుండా, పుట్టబోయే బిడ్డ బరువు అసాధారణంగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గర్భవతిగా ఉన్నప్పుడు షుగర్ వస్తే భవిష్యత్తులో వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి.

అబార్షన్ రిస్క్ మరియు ప్రసవ సమస్యలు:

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం సహజం. దీనివల్ల క్రోమోజోమ్ సమస్యలు తలెత్తి మొదటి మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇక అలాగే ప్రసవ సమయంలో కూడా గర్భాశయం సహజంగా స్పందించకపోవడం వల్ల నొప్పులు రాకపోవడం, లేబర్ పెయిన్స్ ఎక్కువ సమయం రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రసవం కంటే సిజేరియన్ చేయాల్సి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

జాగ్రత్తలు పాటిస్తే లేట్ ప్రెగ్నెన్సీ సేఫ్:

40 ఏళ్లలో ప్రెగ్నెన్సీ అంటే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, నేటి వైద్య శాస్త్రం ఎంతో పురోగమించింది. సరైన పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం, డాక్టర్ల పర్యవేక్షణ ఉంటే ఈ రిస్కులను సులభంగా అధిగమించవచ్చు. ఇక దీపికా పదుకోణే వంటి సెలబ్రిటీలు ఈ విషయంలో చాలామందికి స్ఫూర్తినిస్తున్నారు. కాబట్టి వయసు పెరిగినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యమేమీ కాదు. ఏదేమైనా, రెండోసారి తల్లి కాబోతున్న దీపికాకు అభిమానులు వెల్ విషెస్ తెలియజేస్తున్నారు