రెండవ సారి తల్లి అవుతున్నా తగ్గేదేలే!
నటిగా అంకితభావాన్ని చాటుకోవడంలో దీపికా పదుకొనే ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల రెండోసారి గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే
By: Srikanth Kontham | 25 April 2026 7:00 PM ISTనటిగా అంకితభావాన్ని చాటుకోవడంలో దీపికా పదుకొనే ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల రెండోసారి గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా విశ్రాంతి తీసుకోకుండా కెమెరా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `కింగ్` చిత్ర షూటింగ్‌లో దీపిక తాజాగా అడుగుపెట్టింది. గర్భవతి గా ఉన్నా? వృత్తి పట్ల ఆమె చూపిస్తున్న నిబద్ధతను చూసి చిత్ర పరిశ్రమ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దీపికా కేవలం అతిథి పాత్రకే పరిమితం కాలేదు.
అత్యంత కీలకమైన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటుంది. ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఆమె ఎనిమిది మంది ఫైటర్లతో తలపడే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇసుక నేపథ్యంలో సాగే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని సమాచారం. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూనే రిస్కీ షాట్స్‌ను దీపిక పూర్తి చేసింది. దీపిక మొదటి ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఇంతే యాక్టివ్‌గా పనిచేసింది. `కల్కి 2898 ఏడీ’ ప్రమోషన్లలో పాల్గొనడమే కాక హై హీల్స్ వేసుకుని ఈవెంట్లకు హాజరై షాక్‌కు గురిచేసింది.
తాజాగా రెండవ సారి తల్లి కాబోతున్న తరుణంలో కూడా అంతే పట్టుదలతో పని చేస్తోంది. `కింగ్` సినిమాతో పాటు అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న `రాకా` షూటింగ్‌లో కూడా పాల్గొంటుంది. ఇందులోనూ దీపిక సాహసోపేతంగా పని చేయాల్సిందే. దర్శకుడు అట్లీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా హైలైట్ చేస్తున్న చిత్రమిది. సినిమాలో అల్లు అర్జున్ పాత్ర సినిమాకు ఎంత కీలకమో..హీరోయిన్ గా నటిస్తోన్న దీపిక రోల్ కూడా అంతే కీలకం. దీపిక సైతం భారీ యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా దీపిక పూర్తి స్థాయిలో `రాకా` రంగంలోకి దిగలేదు.
దీపికా పదుకొణే తీసుకుంటోన్న నిర్ణయాలతోనే సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీపికా పదుకొణే ఓ వైపు వ్యక్తిగత జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తూనే మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంది. అంతే విధిగా సమయం వచ్చిందంటే? పోరాటానికి సైతం రంగంలోకి దిగే స్వభావం గల నటి. ఆ మధ్య వర్కింగ్ హావర్స్ విషయంలో గళాన్ని ఎలా వినిపించిందో తెలిసిందే.
