దీపిక పదుకొనేను వెంటాడుతున్న 8 గంటలు!
ముఖ్యంగా దీపిక 8 గంటల పనిదిన డిమాండ్లపై ఫరా ఇటీవల చేసిన కామెంట్ తర్వాత ఇద్దరి మధ్యా చెడిందని ఊహాగానాలు సాగుతున్నాయి.
By: Sivaji Kontham | 30 Sept 2025 11:59 AM ISTభారతదేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన అవకాశం కోసం ఎదురు చూడని కథానాయిక లేదు. అలాంటి అగ్ర కథానాయకుడితో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా దీపిక పదుకొనే వాటిని తన అవివేకంతో కాలదన్నుకుందని విమర్శలొస్తున్నాయి. ఎనిమిది గంటల పనిదినం కుదరదు.. బిడ్డ తల్లికి 6 గంటలు మాత్రమే అనుకూలం! అని కండీషన్ పెట్టడంతో ప్రభాస్ తో స్పిరిట్, కల్కి 2898 ఏడి సినిమాల నుంచి అవకాశాల్ని కోల్పోయింది. రెండు పెద్ద సినిమాల నుంచి తొలగించగానే దీపిక పదుకొనే గురించి అన్ని సినీపరిశ్రమల్లో విస్త్రతంగా చర్చ సాగింది.
ఇప్పుడు ఈ ఎఫెక్ట్ హిందీ చిత్రసీమలోను పని చేస్తోందని గుసగుస వినిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర దర్శకురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తో దీపిక పదుకొనేకు చెడిందని గుసగుస వినిపిస్తోంది. దీపికా పదుకొనే, ఫరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో బాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఫరా దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం చిత్రంతో దీపిక పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ సహా పలు చిత్రాలకు ఈ ఇద్దరూ కలిసి పని చేసారు. సంవత్సరాలుగా ఇద్దరి మధ్యా మంచి సంబంధాలున్నాయి.
కానీ ఇప్పుడు ఎనిమిది గంటల పనిదినం ఆ ఇద్దరి మధ్యా చిచ్చు పెట్టిందని గుసగుస వినిపిస్తోంది. ముఖ్యంగా దీపిక 8 గంటల పనిదిన డిమాండ్లపై ఫరా ఇటీవల చేసిన కామెంట్ తర్వాత ఇద్దరి మధ్యా చెడిందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలో వెనుక ఉన్న అసలైన కారణమేమిటో ఇప్పుడు అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఆసక్తికరంగా ఫరా ఖాన్ ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌ను అన్‌ఫాలో చేసింది. అయితే రణ్ వీర్ మాత్రం ఫరాను అనుసరిస్తూనే ఉన్నారు.
ఫరా ఇటీవల ఒక వ్లాగ్‌లో రాధికా మదన్‌తో మాట్లాడుతూ.. ఎనిమిది గంటల పనిదినం ప్రస్థావన తెచ్చారు. ``నీకు 8 గంటల షిఫ్ట్ లేదు, నేను ఊహిస్తున్నాను?`` అని ఫరా రాధికనుద్ధేశించి వ్యాఖ్యానించింది. రాధిక మాట్లాడుతూ ``56 గంటలు నాన్ స్టాప్ లేదా 48 గంటలు నాన్-స్టాప్ గా పని చేస్తున్నాను`` అని బదులిచ్చింది, దానికి ఫరా తాను 8 గంటల పని షిఫ్ట్‌కు మద్దతు ఇవ్వనని సరదాగా వ్యాఖ్యానించింది. దానికి ప్రతిస్పందనగా బంగారం ఇలా తయారవుతుంది! అని రాధిక చమత్కరించింది.
దీనికి ముందు మరో వ్లాగ్‌లో ఫరా దీపిక గురించి సరదాగా ఇలా వ్యాఖ్యానించింది. ఆమె ఇప్పుడు 8 గంటలు మాత్రమే షూట్ చేస్తుంది.. ఆమెకు మా షోకి రావడానికి సమయం లేదు! అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దీపిక పదుకొనే, ఫరా మధ్య చెడిందంటూ జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
దీపిక పదుకొనే ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడి నుంచి వైదొలిగింది. అంతకుముందే సందీప్ వంగా స్పిరిట్ నుంచి తప్పించాడు. ఆ తరవాత దీపిక వరుసగా సమస్యల్ని ఎదుర్కొంటోంది.
