Begin typing your search above and press return to search.

మొదటి భారతీయురాలిగా దీపిక.. అదృష్టం కలిసొస్తోందే !

దీపిక ఎప్పటికప్పుడు తన నటనతోనే కాకుండా స్పీచ్ లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   16 Oct 2025 12:26 PM IST
మొదటి భారతీయురాలిగా దీపిక.. అదృష్టం కలిసొస్తోందే !
X

గత కొన్ని రోజులుగా వరుసగా వివాదాలు ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో భారీగా నెగెటివిటీని సొంతం చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే. అయితే ఈమె చేసిన కామెంట్లు.. పెట్టిన కండిషన్లు కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా.. ఆ సమస్యలను ఎదుర్కొన్న నటీమణులు, నటులు ఈమెకు మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ఈమె వరుసగా ఒకదానిని మించి మరొక గౌరవం లభిస్తూ ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే "ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్" వ్యవస్థాపకురాలిగా పేరు దక్కించుకున్న ఈమెకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ "మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారి"గా బాధ్యతలను అప్పగిస్తూ నియమించిన విషయం తెలిసిందే.. ఈ గౌరవాన్ని అందుకున్న కొన్ని రోజులకే మరొక అరుదైన రికార్డు సృష్టించింది దీపిక. తొలి భారతీయ సెలబ్రిటీగా పేరు అందుకుంది.

దీపిక ఎప్పటికప్పుడు తన నటనతోనే కాకుండా స్పీచ్ లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈమెకు మరో గౌరవాన్ని కట్టబెట్టారు మెటా AI.. AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా దీపిక ఇప్పుడు అవతరించింది. తాజాగా మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈమెకు మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఈ విషయంపై అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక దీపిక షేర్ చేసుకున్న వీడియో విషయానికి వస్తే.. ఇప్పుడు నేను మెటా ఏఐలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీంతో భారతదేశం , యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా అంతటా నా వాయిస్ తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి, మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయండి" అంటూ తన వీడియో ద్వారా కోరింది దీపికా పదుకొనే.

ఇకపోతే మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్ బాట్ యాప్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇక్కడ వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటా తో శిక్షణ ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. అటు చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్ తో కూడా సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్ రూపంలో అందిస్తే చాలు పూర్తి సమాచారాన్ని మీ ముందు పెడుతుంది. ఒకవేళ వాయిస్ రూపంలో వినాలనుకుంటే మీకు చక్కటి సమాధానాన్ని అందిస్తూ మాట్లాడేస్తుంది కూడా. ఏదైనా అంశం మీద మీరు లోతుగా తెలుసుకోవాలంటే మీకు విశ్లేషణ ఇస్తూ సహాయపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ మీ అభిమాన నటి దీపికా పదుకొనే వాయిస్ తోనే మీరు వినవచ్చు.

ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు.అయితే ఆమె వాయిస్ మీకు కేవలం ఏఐ ఆధారంగా మాత్రమే అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడినట్లు.. దీపికతో కూడా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడొచ్చు అన్నమాట. మొత్తానికైతే ఇండియాలో AI కి తన వాయిస్ అందిస్తున్న మొదటి సెలెబ్రిటీగా దీపికా పదుకొనే రికార్డు సృష్టించింది. ఇక జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దీపికాకు అదృష్టం బాగా కలిసి వస్తోందని చెప్పవచ్చు .