Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయంగా దీపిక ఇమేజ్ పెంచిన టాలీవుడ్

భార‌త‌దేశంలో అత్యుత్త‌మ న‌టీమ‌ణుల జాబితా నుంచి దీపిక ప‌దుకొనే పేరు ఎప్ప‌టికీ చెరిగిపోదు. నేటి జెన్ జెడ్ తో పోటీప‌డుతూ ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతున్న దీపిక బాలీవుడ్ టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది.

By:  Sivaji Kontham   |   3 Sept 2025 10:07 AM IST
అంత‌ర్జాతీయంగా దీపిక ఇమేజ్ పెంచిన టాలీవుడ్
X

భార‌త‌దేశంలో అత్యుత్త‌మ న‌టీమ‌ణుల జాబితా నుంచి దీపిక ప‌దుకొనే పేరు ఎప్ప‌టికీ చెరిగిపోదు. నేటి జెన్ జెడ్ తో పోటీప‌డుతూ ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతున్న దీపిక బాలీవుడ్ టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. 40 సంవ‌త్స‌రాల వ‌య‌సుకు చేరువ‌వుతున్నా దీపిక ఇప్ప‌టికీ ఏజ్ లెస్ బ్యూటీగా, ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని ఏల్తూనే, గ్లామ‌ర్ రంగంలో త‌న స్థానాన్ని మ‌రింత బెట‌ర్‌మెంట్ కి చేర్చుతోంది.

నిజానికి రంగుల ప్ర‌పంచంలో క‌థానాయిక‌ల మైలేజ్ చాలా స్వ‌ల్ప‌కాలికం. పైగా పెళ్ల‌యిన న‌టికి అవ‌కాశాలు రావ‌డం చాలా క‌ష్టం. కానీ ఒక బిడ్డ‌కు మ‌మ్మీ అయ్యాక కూడా దీపిక ప‌దుకొనే క్రేజ్ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. అయితే దీనికి కార‌ణం.. దీపిక స‌రైన స‌మ‌యంలో టాలీవుడ్ లో అడుగుపెట్ట‌డ‌మే. వ‌రుస ప‌రాజ‌యాలు, రొటీన్ స్ట‌ఫ్‌తో బాలీవుడ్ ప్ర‌భ అంత‌ర్జాతీయ వేదిక‌పై మ‌స‌క‌బారుతున్న ఈ స‌మ‌యంలో దీపిక చాలా తెలివిగా `క‌ల్కి 2898 ఏడి` వంటి గ్లోబ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాని ఎంపిక చేసుకుంది. ఈ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా దీపిక‌ను అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ది ఒక తెలుగు ద‌ర్శ‌కుడు కావ‌డం గ‌ర్వ‌కార‌ణం. బాహుబ‌లి స్టార్ ప్రభాస్ ఛ‌రిష్మా కూడా దీపిక‌కు క‌లిసొచ్చే అంశంగా మారింది.

ఈ సినిమా త‌ర్వాత కూడా వ‌రుస‌గా టాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ, దీపిక త‌న క్రేజ్ త‌గ్గ‌కుండా నిల‌బెట్టుకోవ‌డంలో తెలివైన ప్లాన్ ని అమ‌లు చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. పుష్ప ఫ్రాంఛైజీతో సంచ‌ల‌నాలు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న అట్లీ తెర‌కెక్కిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టిస్తూ దీపిక అంత‌ర్జాతీయంగా మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తోంది. `క‌ల్కి 2898 ఏడి` త‌ర్వాత AA22XA6 ప్ర‌మోష‌న‌ల్ స్టంట్ ఈ భామ రేంజును అమాంతం పెంచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

కార‌ణం ఏదైనా గ్లోబ‌ల్ వ‌ర‌ల్డ్ లో దీపిక ఇమేజ్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ప‌ర్య‌వ‌సానంగా ఇప్పుడు ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ బ్రాండ్ లూయీస్ వీట్ట‌న్ జూరీ స‌భ్యురాలిగా అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుంది. దీపికా పదుకొనే లూయిస్ విట్టన్ - 2025 LVMH బ‌హుమ‌తికి అంబాసిడర్ గా, జ్యూరీ సభ్యురాలిగా చేరార‌ని స‌ద‌రు సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. భార‌త‌దేశం నుంచి ఇలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న మొద‌టి క‌థానాయిక‌గా దీపిక చ‌రిత్ర‌కెక్కింది.

గత సంవత్సరం హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మాన్ లూయీస్ వీట్ట‌న్‌కి ప్రత్యేక జ్యూరీ సభ్యురాలిగా పనిచేశారు. స్వీడిష్ డిజైనర్ ఎల్లెన్ హోడకోవా లార్సన్ కు ప్రధాన బహుమతిని ప్రదానం చేశారు. ఈ సంవత్సరం జ్యూరీలో దీపిక చేరడం ఒక చారిత్రాత్మక క్ష‌ణం. ఎందుకంటే ఫ్యాషన్ వ‌ర‌ల్డ్‌లో అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ బ్రాండ్ ప్ర‌మోట‌ర్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. లూయిస్ విట్టన్ సోషల్ మీడియాలో అధికారికంగా దీనిని ధృవీక‌రించింది.

2022లో లూయిస్ విట్టన్ -కార్టియర్ బ్రాండ్ కి సంతకం చేసిన మొట్టమొదటి భారతీయురాలుగాను దీపిక పేరు మార్మోగింది. ఇప్పుడు మ‌రో అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుంది. ఒక అగ్ర క‌థానాయికగా దీపిక‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న ఇమేజ్ కార‌ణంగా ఈ ఎంపిక సాధ్య‌మైంద‌ని లూయీస్ వీట్ట‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అల్లు అర్జున్ తో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా స‌హా, ప్రభాస్‌తో తిరిగి కలిసిన కల్కి 2898 AD సీక్వెల్ లోను దీపిక తదుప‌రి క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల కంటే టాలీవుడ్ సినిమాల‌పైనే దీపిక ఫోక‌స్ పెట్ట‌డం త‌న ఇమేజ్ ని పెంచిందే కానీ త‌గ్గించ‌లేదు.