Begin typing your search above and press return to search.

దీపికా ప‌దుకొణే లైవ్ లవ్ లాఫ్ వెనుక చాలా క‌థే ఉందే!

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె కెరీర్‌లో సాధించిన విజయాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వెళ్లి నేటు బాలీవుడ్ నే ఏల్తోంది.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 12:00 AM IST
దీపికా ప‌దుకొణే లైవ్ లవ్ లాఫ్ వెనుక చాలా క‌థే ఉందే!
X

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె కెరీర్‌లో సాధించిన విజయాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వెళ్లి నేటు బాలీవుడ్ నే ఏల్తోంది. అంత‌టి న‌టి సైతం మానసిక ఆరోగ్యం పట్ల చేసిన పోరాటం కూడా అంతే విశిష్టమైనది. గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన డిప్రెషన్ గురించి దీపిక బహిరంగంగా మాట్లాడి ఎందరికో ధైర్యాన్ని ఇచ్చింది. అయితే దీపికా అంతటి మానసిక వేదనను అనుభవిస్తున్న సమయంలో ఆమెకు అత్యంత ఆప్తులైన కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం మొదట్లో తెలియకపోవడం గమనార్హం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా సోదరి అనీషా పదుకొణె ఈ విషయమై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దీపిక డిప్రెషన్‌తో బాధపడుతున్న ప్రారంభ రోజుల్లో ఒకే ఇంట్లో ఉన్నా? దగ్గరి బంధం ఉన్నప్పటికీ తాము ఆ విషయాన్ని గుర్తించలేకపోయామ‌న్నారు. బయటకు ఎంతో సాధారణంగా, విజయవంతంగా కనిపిస్తున్న వ్యక్తి లోపల ఇంతటి మానసిక సంఘర్షణను అనుభవిస్తున్నారనే కనీస ఊహ కూడా తమకు రాలేదన్నారు. మానసిక సమస్యలు అనేవి కంటికి కనిపించకుండా ఒక వ్యక్తిని ఎంతలా కుంగదీస్తాయో ? చెప్పడానికి తమ కుటుంబ అనుభవమే పెద్ద ఉదాహరణ అని గుర్తుచేసుకున్నారు.

దీపికా ఎదుర్కొంటున్న సమస్య పట్ల స్పష్టత వచ్చిన తర్వాత కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైందని అనీషా వెల్లడించారు. ఒక వైపు సెలబ్రిటీగా నిరంతరం లైమ్‌లైట్‌లో ఉంటూ..మరోవైపు అంతర్గతంగా తీవ్ర పోరాటం చేయడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైందన్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులుగా తామంతా దీపికాకు అండగా నిలబడటం, మానసిక ప్రశాంతతను అందించడం బాధ్యతగా మారినట్లు వివరించారు.

ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కుటుంబమే కాకుండా.. జీవిత భాగస్వామి ఇచ్చే మద్దతు కూడా ఎంతో కీలకమైనదని ఈ సందర్భంగా తెలుస్తోంది. దీపికా పదుకొణె జీవితంలో భర్త రణ్‌వీర్ సింగ్ ఎల్లప్పుడూ బలమైన స్తంభంలా నిలిచారని.. దీపిక మానసిక ఆరోగ్య ప్రయాణంలో నిరంతరం తోడుగా ఉంటూ ప్రోత్సహించారని పలు సందర్భాల్లో స్పష్టమైంది. ప్రియమైన వారి నుండి లభించే ప్రేమే మానసిక సమస్యల నుండి త్వరగా కోలుకోవడానికి ఔషధంగా పనిచేస్తుందని అనీషా అభిప్రాయ‌ప‌డింది.

ఈ వ్యక్తిగత అనుభవాల నుండే స్ఫూర్తి పొంది దీపికా పదుకొణె 'లైవ్ లవ్ లాఫ్' అనే ఫౌండేషన్‌ను స్థాపించారు. తమలాగే ఇతర కుటుంబాలు కూడా వారికి వచ్చే మానసిక మార్పులను గుర్తించలేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించడం, అవగాహన పెంచడం , అవసరమైన వారికి మానసిక నిపుణుల సాయం అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.