దీపికా పదుకొణే లో కూడా కంగన దాగి ఉందే!
వివాదం రానంత సేపే మౌనం..వస్తే విశ్వరూపం ఎలా ఉంటుంది? అన్నది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చాలా సార్లు బాలీవుడ్ కి చూపించింది.
By: Srikanth Kontham | 1 Oct 2025 9:00 PM ISTవివాదం రానంత సేపే మౌనం..వస్తే విశ్వరూపం ఎలా ఉంటుంది? అన్నది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చాలా సార్లు బాలీవుడ్ కి చూపించింది. ఆ విషయంలో కంగన ముందున్న ప్రత్యర్ది ఎంత బలవంతుడైనా ఢీ అంటే ఢీ అనే బరిలోకి దిగుతుంది. తాను చెప్పాలనుకున్నది సూటిగా ముఖం మీదనే చెబుతుంది. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. అది నిర్మాతతో గోడవైనా..దర్శకుడితో లొల్లి అయినా...హీరోతో వివాదమైనా? కంగన రియాక్షన్ లో ఎలాంటి మార్పు ఉండదు. మాటకు మాట..దెబ్బకు దెబ్బ సమాధానం అన్న తీరులో కంగన విధానం కనిపిస్తుంది.
ఆ రెండింటినీ మించి గొప్ప సినిమాల్లో:
ఇలాంటి నటిని బాలీవుడ్ మునుపెన్నడు చూడలేదు. ఎంతో మంది నటీమణులు వస్తుంటారు. పోతుంటారు. కానీ కంగనతో మాత్రం జాగ్రత్తగా ఉండాలని అప్పటి నుంచి బాలీవుడ్ కూడా అలెర్ట్ అయింది. తాజాగా దీపికా పదుకొణేలో కూడా కంగన లాంటి ఫైరింగ్ యాంగిల్ దాగి ఉందని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు వదులుకున్న నేపథ్యంలో వాటిపై దీపిక ఎలా రియాక్ట్ అయిందో తెలిసిందే. ఆ రెండు ఛాన్సులను తనకు ఓ జుజూబీ లాంటివని కొట్టి పారేసింది. అంతకు మించిన గొప్ప సినిమాల్లో పనిచేసే ప్రతిభావంతురాలునని కాలరెగరేసింది.
ఘాటుగా..ధీటుగా స్పందన:
తాజాగా మరోసారి తనలో డేరింగ్ యాంగిల్ ని బయట పెట్టింది. తాను ముక్కు సూటి మనిషినని...డొంక తిరుగుడు సమాధానాలుండవ్ అంది. విలువల కోసం ఎంత దూరమైనా వెళ్తానంది. తప్పు చేస్తే ఎదుట వారినైనా ప్రశ్నిస్తా నంది. కష్టమైనా ఇష్టంతో పని చేస్తాను తప్ప దేనికి రాజీ పడే వ్యక్తిని కాదంది. ఎంతటి వారి ముందైనా తల దించే ప్రసక్తే లేదంది. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం తనకేంటని? ఎలాంటి తాటకు చప్పుళ్లకు తాను భయపడే రకాన్ని కాదని వెల్లడించింది. ఇంత వరకూ దీపికా పదుకొణే ఏ విషయంలో ఇంత ఘాటుగా..ధీటుగా స్పందించలేదు.
రెండు చిత్రాలతో బిజీ:
తొలిసారి టాలీవుడ్ సినిమాలతో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇలా రియాక్ట్ అయింది. బాలీవుడ్ లో కూడా కొన్ని విమర్శలు అప్పుడప్పుడు ఎదుర్కుంది. కానీ వాటిని అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాన్ ఇండియా సినిమాల విషయంలో తలెత్తిన వివాదంలో మాత్రం తానెంత మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం దీపికా పదుకొణే బన్నీ 22వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో` కింగ్ `చిత్రలోనూ నటిస్తోంది.
