Begin typing your search above and press return to search.

క‌ష్ట కాలంలో దీపిక‌కు పెద్ద ఊర‌ట ఇది

ఇటీవ‌లి కాలంలో కొన్ని తప్పుడు కార‌ణాల‌తో దీపిక ప‌దుకొనే పేరు మీడియా హెడ్ లైన్స్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   11 Oct 2025 9:35 AM IST
క‌ష్ట కాలంలో దీపిక‌కు పెద్ద ఊర‌ట ఇది
X

ఇటీవ‌లి కాలంలో కొన్ని తప్పుడు కార‌ణాల‌తో దీపిక ప‌దుకొనే పేరు మీడియా హెడ్ లైన్స్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న రెండు భారీ చిత్రాల్లో న‌టించాల్సిన దీపిక ఆ రెండు ఛాన్సుల్ని కోల్పోవ‌డం బిగ్ షాకిచ్చింది. స్పిరిట్, క‌ల్కి 2898 ఏడి సినిమాల నుంచి దీపిక‌ను తప్పించ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఈ వార్త‌ల్ని హైలైట్ చేసిన మీడియా విష‌యంలో దీపిక తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. అస్త‌వ్య‌స్థ‌మైన సినీప‌రిశ్ర‌మ‌లో మ‌గాళ్ల‌కు ఒక‌లా.. ఆడాళ్ల‌కు మ‌రొక‌లా ట్రీట్ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పింది.

వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా త‌న‌పై సాగుతున్న ప్ర‌చారంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. అయితే దీపిక‌కు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ, వాట‌న్నిటికీ భిన్నంగా సంఘంలో త‌న గౌర‌వానికి మాత్రం త‌క్కువేమీ కాదు. ఇప్పుడు త‌న కీర్తి కిరీటంలో చెప్పుకోద‌గ్గ క‌లికితురాయి చేరింది.

దీపికా పదుకొనేను కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్ ఎఫ్‌డ‌బ్ల్యూ) మొట్టమొదటి `మానసిక ఆరోగ్య రాయబారి`గా నియమించ‌డం మేలి మ‌లుపు. దేశంలో మానసిక ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను ప్రేరేపించడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న ఒక మైలురాయి అడుగు ఇది. క‌ష్ట కాలంలో త‌న‌కు పెద్ద ఊర‌ట ఇది. ప్ర‌భుత్వం త‌ర‌పున అత్యంత కీల‌క విభాగంలో ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కింది.

ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా మాట్లాడుతూ..ప్ర‌జారోగ్యంలో మాన‌సిక ఆరోగ్యం ఒక‌ భాగం.. దీనిపై విస్త్ర‌త అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే దీని ఉద్ధేశ‌మ‌ని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో గొప్ప‌ పురోగతిని సాధించింద‌ని దీపిక అన్నారు. దేశ మంత్రిత్వ శాఖ‌తో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషాన్నిస్తోంద‌ని దీపిక తెలిపారు. దీపిక ప‌దుకొనే ప్ర‌స్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. షారూఖ్ స‌ర‌స‌న `కింగ్` చిత్రంలో, అల్లు అర్జున్ స‌ర‌స‌న అట్లీ ద‌ర్శ‌క‌త్వంలోని మూవీలోను న‌టిస్తోంది.