'కింగ్'తోను ఇలాగే ప్రవర్తిస్తావా? నిలదీసిన ప్రభాస్ ఫ్యాన్స్!
``పిల్లల తల్లులు- ఎనిమిది గంటల పనిదినం``పై కొంతకాలంగా సినీపరిశ్రమల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 16 Nov 2025 3:15 PM IST``పిల్లల తల్లులు- ఎనిమిది గంటల పనిదినం``పై కొంతకాలంగా సినీపరిశ్రమల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే ప్రత్యేకించి ఈ అంశంపై పోరాటం సాగిస్తున్నారు. సందీప్ వంగా స్పిరిట్, నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` నుంచి తొలగించిన తర్వాతా దీపిక తన పట్టుదలలో తగ్గేదే లే! అంటూ భీష్మించుకు కూచుంది. తనకు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక శ్రేయస్సు చాలా ముఖ్యమని పదే పదే బహిరంగ వేదికలపై ప్రకటిస్తోంది దీపిక. ఆ రెండిటి కోసం నిబద్ధతతో కట్టుబడి ఉన్నానని చెబుతోంది.
ఇప్పుడు మరోసారి పని కట్టుబాట్ల విషయంలో సొంత నియమాలు ఉన్నాయని బలంగా చెబుతోంది. ``మనమంతా ఓవర్ టైమ్ పని చేయడాన్ని నిబద్ధత అనుకుంటున్నాం. అందుకే దీనిని కామన్ గా మార్చేశాం. కానీ మనిషి 8గంటలు మించి పని చేయకూడదు. మంచి ఆరోగ్యంతో ఉంటేనే మంచి పని చేయగలం. అనారోగ్యం పాలైతే అసలుకే మోసం.. ఎన్ని అదనపు గంటలు పని చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు..`` అని దీపిక వ్యాఖ్యానించింది.
అయితే దీపిక వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసాయి. సందీప్ వంగా తో పాటు కల్కి ఫ్యాన్స్ ను కూడా తీవ్రంగా కలచివేసాయి. ప్రభాస్ అభిమానులు దీపికపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాలో నటిస్తున్నావు కదా..ఆ సినిమా కోసం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నావా? అంటూ నిలదీస్తున్నారు. అయితే షారూఖ్ తో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించాను.. మా మధ్య ప్రతిదీ బావుంటుందని దీపిక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఖాన్ స్కూల్ లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఉన్నానని వెల్లడించింది.
కెరీర్ లో నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ప్రతిసారీ నా కుటుంబం, అభిమానుల కారణంగా అన్నిటి నుంచి బయటపడ్డానని, పరిశ్రమలో తనను నమ్మి అవకాశాలు కల్పించే వారు ఎప్పుడూ ఆదుకున్నారని కూడా దీపిక ధీమాను వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో రెండు పెద్ద అవకాశాల్ని కోల్పోయాకా దీపిక ఎంతో కాన్ఫిడెంట్‌గా వ్యవహరిస్తోంది.
అయితే దీపిక వర్సెస్ ప్రభాస్ వివాదంలో చాలా విషయాలు సైడ్ లైన్ అయిపోయాయని కూడా గుసగుసలు వినిపించాయి. దీపిక పదుకొనే 6గంటలు మాత్రమే సెట్స్ లో పని చేస్తానని కండిషన్ పెట్టిందని, తన స్టాఫ్ సభ్యులకు కూడా స్టార్ హోటల్ సౌకర్యాలు కోరిందని, ఊహించిన దానికంటే అధిక పారితోషికం డిమాండ్ చేసిందని కూడా గుసగుసలు వినిపించాయి. వీటన్నిటినీ మించి వందల కోట్లు పెట్టుబడులుగా వెదజల్లి పని చేసే భారీ ప్రాజెక్టులకు కొంత పట్టు విడుపు ఉండాలి. కానీ దీపికలోని బలమైన ఫెమినిజంతో వేగలేమనే భయాందోళన దర్శకనిర్మాతలలో మొదలైందని కూడా గుసగుసలు వినిపించాయి.
