హీరోలు చేస్తే లేని తప్పు హీరోయిన్లు అడిగితే తప్పా?
తాను కూడా ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఇషితా దత్తా గుర్తుచేశారు.
By: Srikanth Kontham | 16 Oct 2026 12:00 AM ISTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా నటీనటుల పని గంటల పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. షూటింగ్ సెట్స్‌లో నటీనటులు.. ముఖ్యంగా హీరోయిన్లు 8 గంటల షిఫ్ట్ వర్క్ డిమాండ్ చేయడంపై పరిశ్రమలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో `దృశ్యం 3` సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి ఇషితా దత్తా ఈ వివాదంపై స్పందించారు. స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణే మద్దతుగా నిలిచారు.
`కల్కి 2898 AD` సీక్వెల్ ప్రాజెక్ట్‌ల నుంచి దీపికా పడుకోణే తప్పుకోవడానికి ఎనిమిది గంటల షిఫ్ట్ డిమాండ్ కూడా ఒక కారణమనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీలో హాట్ డిబేట్ నడుస్తుండగా ఇషితా దత్తా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. షూటింగ్లో 8 గంటల షిఫ్ట్ కోరడం ఎంతమాత్రం అసమంజసమైన డిమాండ్ కాదన్నారు.
`ఒక నటి ఎనిమిది గంటల షిఫ్ట్ కావాలని కోరినప్పుడు.. ప్రొడక్షన్ హౌస్ దానికి అంగీకరించకపోవడం వారి వ్యక్తిగత.. బిజినెస్ ఛాయిస్ కావచ్చు. ఆ డిమాండ్‌ను తప్పుగా చూపిస్తూ సదరు నటిని చిన్నచూపు చూడటం .. అవమా నించడం సరైన పద్ధతి కాదు. రోజుకు 12 నుండి 15 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండే నటీనటులు చాలామంది ఉండొచ్చు. కానీ తక్కువ సమయం కేటాయించాలనుకునే వారి నిర్ణయాన్ని తక్కువ చేసి మాట్లాడకూడద`న్నారు.
తాను కూడా ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఇషితా దత్తా గుర్తుచేశారు. ఒక తల్లిగా మారిన తర్వాత కుటుంబం, పిల్లల పెంపకం , షూటింగ్ బాధ్యతలను బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో అర్థమవు తుందన్నారు . ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆ బాధ్యతల్లోని తీవ్రత .. శ్రమ ఏంటో తెలుస్తుంది. నాకు కూడా అంతటి డిమాండ్ చేసే స్థాయి ఉంటే? నేను కూడా ఖచ్చితంగా 8 గంటల షిఫ్ట్ డిమాండ్ చేసేదాన్ని. అయితే ప్రస్తు తానికి నేను ఆ స్థానంలో లేను` అని ఇషితా నిజాయితీగా వ్యాఖ్యానించారు.
గతంలో దీపిక వర్కింగ్ అవర్స్ వివాదంపై ఇండస్ట్రీలోని పలువురు అగ్ర హీరోలు గత కొన్నేళ్లుగా రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారని.. కానీ వారి గురించి ఎవరూ ప్రశ్నించరని గుర్తుచేశారు. నటీనటుల శారీరక, మానసిక ఆరోగ్యం , మెరుగైన పని వాతావరణం కోసం తాను ఈ డిమాండ్ చేశానని తెలిపారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, కరీనా కపూర్, అనన్య పాండే, సబా ఆజాద్ వంటి పలువురు కథానాయికలు కూడా దీపికా డిమాండ్‌కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
