ట్రెండీ స్టోరి: రెమ్యునరేషన్‌లో టాప్ హీరోయిన్లు
అయితే ఇప్పుడు దీపిక ప్రశాంతంగా తనకు నచ్చిన బాలీవుడ్ సినిమాలకు కమిటవుతోంది. అక్కడ కింగ్ ఖాన్ షారూఖ్ ఈ భామకు `కింగ్` చిత్రంలో నటించినందుకు భారీ పారితోషికాన్ని ముట్టజెబుతున్నాడు.
By: Sivaji Kontham | 19 Nov 2025 11:02 AM ISTఈ దశాబ్ధంలో టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కథానాయికల జాబితాను తిరగేస్తే, మెజారిటీ భాగం ముంబై భామలదే హవా. ఇప్పటివరకూ ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు సినిమాలలో నటించిన వారిలో అత్యధిక పారితోషికం అందుకున్న భామలుగా దీపిక పదుకొనే, ఆలియాభట్, కంగన రనౌత్ పేర్లు ప్రముఖంగా జాబితాలో నిలుస్తున్నాయి. కల్కి 2898 ఏడి చిత్రానికి దీపిక పదుకొనే 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని నిర్మాతలు 18కోట్లు ముట్టజెప్పారని కథనాలొచ్చాయి. ఇటీవల దీపిక భారీగా పారితోషికం పెంచేయడంతో రెండు పెద్ద సినిమా అవకాశాలను కోల్పోయిందని కథనాలొచ్చాయి. సందీప్ రెడ్డి వంగా- స్పిరిట్, నాగ్ అశ్విన్ - కల్కి 2898 ఏడిల నుంచి దీపికను తొలగించడానికి కారణాలలో అధిక పారితోషికం డిమాండ్ ఒకటి.
అయితే ఇప్పుడు దీపిక ప్రశాంతంగా తనకు నచ్చిన బాలీవుడ్ సినిమాలకు కమిటవుతోంది. అక్కడ కింగ్ ఖాన్ షారూఖ్ ఈ భామకు `కింగ్` చిత్రంలో నటించినందుకు భారీ పారితోషికాన్ని ముట్టజెబుతున్నాడు. అయితే దీపిక రెండు పెద్ద అవకాశాల్ని కోల్పోయిన క్రమంలోనే మరో బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. పీసీ ప్రస్తుతం ఎస్ఎస్.రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పీసీ తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకుంటోందని సమాచారం.
తాజా గుసగుసల ప్రకారం.. గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రాకు 30కోట్ల పారితోషికాన్ని నిర్మాత కె.ఎల్.నారాయణ ఆఫర్ చేసారని తెలిసింది. అయితే ఇంత పెద్ద పారితోషికం ఇవ్వడానికి కారణం ప్రియాంక చోప్రాకు ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపు. పాశ్చాత్య దేశాలలో పీసీకి ఉన్న గుర్తింపు, హాలీవుడ్ తో తన అనుబంధం.. వారణాసి చిత్రానికి మార్కెట్ పరంగా అదనపు బలం అవుతుందని టీమ్ భావిస్తోంది. మహేష్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో విడుదల చేయాలని రాజమౌళి బృందం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే వారణాసి టైటిల్ అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. టైటిల్ గ్లింప్స్ ఇంటర్నెట్లో వైరల్ గా దూసుకెళుతోంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆలియా భట్ ఆ సినిమాలో పరిమిత నిడివి ఉన్న పాత్రలో నటించినా భారీ పారితోషికం తీసుకుందని కథనాలొచ్చాయి. ఆలియా ఇటీవల ఒక్కో సినిమాకు 30కోట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. దీపిక పదుకొనే కూడా 30 కోట్లు అడిగేస్తున్నా, ఇటీవల రెండు పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశం కోల్పోవడంతో రేంజ్ తగ్గిందని గుసగుస వినిపిస్తోంది. కంగన రనౌత్ ఇంతకుముందు సౌత్ లో తలైవి లాంటి భారీ ప్రాజెక్ట్ కోసం 30కోట్లు డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపించాయి.
